100000 మ‌ర‌ణాలు!

పారిస్ : మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ‌లాడిస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య ల‌క్ష దాటింది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యానికి కొవిడ్-19 మృతుల సంఖ్య 1,01,551కి చేరింది. అలాగే దాదాపు 200 దేశాల‌కు పాకిన ఈ వైర‌స్ ఇప్ప‌టివ‌ర‌కు 16,76,532 మందికి సోకింది. అంటే మ‌ర‌ణాలు ల‌క్ష‌, కేసులు ప‌ద‌హారు ల‌క్ష‌లు దాటాయ‌న్న‌మాట. క‌రోనా వైర‌స్‌కు మందు లేదు. ఈ అంటువ్యాధి ఒక‌రి నుంచి వేరొక‌రికి అంట‌కుండా సామాజిక దూరం పాటించ‌డం ఒక్క‌టే దీని నివార‌ణ‌కు మార్గం. ప్ర‌స్తుతానికి అంత‌కుమించి సొల్యూష‌న్స్ లేవు. క‌రోనా తాకిడి ఉన్న దేశాల‌న్నింటిలోనూ లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. మ‌న దేశం త‌ర‌హాలోనే ఇత‌ర దేశాల్లోనూ సంపూర్ణంగా లేదా పాక్షికంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ, కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. మ‌ర‌ణాలు ల‌క్ష దాటాయి. ఈ మ‌ర‌ణాల్లో అత్య‌ధిక మృతులు ఇట‌లీలో సంభ‌వించాయి. అక్క‌డ 18,849 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. విచిత్ర‌మేమింటే, ఏడు రోజుల క్రితం వ‌ర‌కు ప‌ది వేల మ‌ర‌ణాలు కూడా దాట‌ని అమెరికా మ‌రికొన్ని గంట‌ల్లో ఇట‌లీ రికార్డును బ‌ద్ద‌లు గొట్ట‌బోతున్న‌ది. ప్ర‌స్తుతం అమెరికాలో 488,980 కేసులు న‌మోదుకాగా, 18,009 మంది మ‌ర‌ణించారు. ప్ర‌తి రోజూ వెయ్యికి త‌గ్గ‌కుండా అమెరికాలో ప్రాణాలు పోతున్నాయి. త‌దుప‌రి స్థానాల్లో స్పెయిన్‌ 15,970 మ‌ర‌ణాల‌తో, ఫ్రాన్స్‌ 13,197 మ‌ర‌ణాల‌తో నిలిచాయి. ఇక బ్రిట‌న్‌, బెల్జియం, నెద‌ర్లాండ్స్ వంటి దేశాలు కూడా ప‌రుగులు తీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య ల‌క్ష దాట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?