నాయిబ్రాహ్మణుల ఉపాధికి దెబ్బ

హైదరాబాద్‌ : కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నాయి బ్రాహ్మణులు, దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయా వర్గాలకు అందిస్తున్న సహాయక చర్యలను నివేదించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్స్‌ మూత పడ్డాయని, దీంతో నాయిబ్రాహ్మణుల ఉపాధి దెబ్బతిందని, రోజు వారి జీవనానికి కష్టం అవుతుందంటూ నాయి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు ధనరాజు రాసిన లెటర్‌ను హైకోర్టు పిల్‌గా తీసుకుంది. పేదలకు ఒక వ్యక్తికి 12 కిలోల బియ్యం, రేషన్‌ కార్డు ఉన్నవారికి 1500 రూపాయలు నగదు ప్రభుత్వం ఇచ్చిందని, రేషన్‌ కార్డు లేని వారికి 12 కిలోల బియ్యం, 500 రూపాయలు చొప్పున నగదు ఇచ్చిందని ఆయన లేఖలో వివరించారు. ఇదేవిధంగా నాయిబ్రాహ్మణుల కూడా సాయం అందించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విచారణ 22 కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం నివేదిక అందజేయాలని కోరింది. ఆర్టిఫిషియల్‌ అవయవాలతో కాలం గడుపుతున్న దివ్యాంగులు వారి సహాయకులు ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రత్యేక పాస్‌లు ఇవ్వాలని న్యాయవాది శివ గణేష్‌ రాసిన లేఖను కూడా ధర్మాసనం విచారించింది. దివ్యాంగులు రెండు సంవత్సరాలకు ఒకసారి అవయవాలను మార్చుకోవాలని, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వారు ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రత్యేక పాస్‌లు ఇవ్వాలని న్యాయవాది పవన్‌ కుమార్‌ ధర్మాసనం కోరారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాల విషయంలో సేవచేసే స్వచ్ఛంద సంస్థల వివరాలు తమ ముందుంచాలని న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. విచారణ 22కి వాయిదా వేసింది

DO YOU LIKE THIS ARTICLE?