మళ్లీ అంతరిక్ష యుద్ధమా?

అంతరిక్ష పోరు మళ్లీ షురువైనట్లుగా కన్పిస్తోంది. అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా దేశాలు ఒకదానికొకటి పోటీపడుతుంటే అలనాటి సోవియట్‌ యూనియన్‌కు, అమెరికాకు మధ్య కొన్నాళ్లపాటు నడిచిన అంతరిక్ష వేడి గుర్తుకొస్తోంది. ఇటీవల చైనా నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి చాంగ్‌ ఝెంగ్‌ 11 అనే వాహక రాకెట్‌ (సీ బేస్డ్‌ స్పేస్‌ రాకెట్‌)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అంతరిక్ష పరిశోధన రంగంలో చైనా కీలక ముందడుగు వేసింది. చైనా తొలిసారిగా నింగిలోకి విజయవంతంగా పంపించిన ఈ తరహా రాకెట్‌ అంతరిక్ష రంగంలోనే కొత్తది. ఈనెల 5వ తేదీన ఎల్లో సీ (పసుపు సముద్రం)లో ఈ ప్రయోగం చోటు చేసుకున్నట్లు చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ వార్తాసంస్థ వెల్లడించింది. ‘చాంగ్‌ ఝెంగ్‌ 11’ అనేది ఘన ఇంధనంతో నడిచే ఒక లాంచ్‌ వెహికల్‌. వాహక రాకెట్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అత్యంత తక్కువ సమయంలోనే ఈ రాకెట్‌ను అలవోకగా ప్రయోగించవచ్చు. అలాగే అత్యంత సులువుగా నియంత్రించవచ్చు. దీన్ని లాంగ్‌మార్చ్‌ 11 రాకెట్‌ అని కూడా పిలుస్తారు. సముద్రం నుంచి రాకెట్‌ను ప్రయోగించడం ప్రపంచంలోనే ఇది ప్రప్రథమమని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. ఈ రాకెట్‌ ద్వారా రెండు ప్రయోగాత్మక కృత్రిమ ఉపగ్రహాలను, 5 వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. కమ్యూనిస్టు దేశం పురోగమనానికి నిదర్శనమిది.
బీజింగ్‌ అంతరిక్ష కార్యక్రమంలో తాజా రాకెట్‌ ప్రయోగం ఒక గొప్ప మలుపు. ఇటీవల కాలంలో చైనా అంతరిక్ష రంగంలో అనేక మైలురాళ్లు అధిగమించింది. ఇప్పటివరకు ఈ రంగంలో ముందుండే అమెరికా, రష్యాలను ఇది అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభంలో చందమామకు ఆవలవైపున (అంటే మనకు కన్పించే వైపు కాకుండా, అవతలి వైపు…దీన్నే మూన్‌ డార్క్‌సైడ్‌ అని పిలుస్తారు) ఉపరితలంపై రోవర్‌ను విజయవంతంగా దించి సంచలనం సృష్టించింది. అదొక చరిత్ర. చందమామ ఉపరితలంపైనే ఒక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పడానికి చైనా పథకం రచిస్తోంది. ఇది ఆషామాషీ విషయం కాదు. అలాగే మార్స్‌ (అంగారక గ్రహం)పైకి ఒక ప్రోబ్‌ను పంపించాలని, భూకక్ష్యలో స్వంతంగా ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతరిక్ష రంగంలో చైనా ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోవడం సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారింది. ఇది అంతరిక్ష పోరుకు దారితీస్తున్నది. అది చివరకు అంతరిక్ష యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అంతరిక్ష పోరు అనే భావన కొత్తది కాదు. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగిన కాలంలో ఈ రెండు దేశాల మధ్య స్టార్‌వార్‌ జరుగుతుందేమోనన్న భయాలు కలిగాయి. రష్యా వ్యోమగామి యూరి గగారిన్‌ తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ కూడా రష్యాదే. ప్రపంచ చరిత్రలోనే సోవియట్‌ యూనియన్‌ ఆ ఘనత సాధించిన తర్వాత, అమెరికా ఎన్నో వైఫల్యాల అనంతరం అపోలో వాహకనౌక ద్వారా చందమామపై తొలిసారిగా అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ 1969లో చందమామపై అడుగుపెట్టి అమెరికా జెండాను పాతిపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య అంతరిక్ష ప్రయోగ విజయాలు, వైఫల్యాలతో పోరు తీవ్రరూపం దాల్చింది. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం ఇరుదేశాల మధ్య వేడి తగ్గింది. ఆ తర్వాత ఇరుదేశాలు జర్మనీని కలుపుకొని భూకక్ష్యలో ఉమ్మడిగా ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఇంటర్నేషనల్‌ స్పేస్‌స్టేషన్‌-ఐఎస్‌ఎస్‌) నెలకొల్పాయి. అమెరికా, రష్యాలు పరస్పర సహకారంతోనే ఐఎస్‌ఎస్‌ను నిర్వహించుకుంటున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే బాధ్యత రష్యాకు చెందిన సోయజ్‌ రాకెట్‌ ఉపగ్రహానిదే. ఇరుదేశాల వ్యోమగాములు అక్కడికి వెళ్లడం, తిరిగి రావడం…ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది.
ఇటీవలకాలంలో అన్ని రంగాల్లోనూ అమెరికాకు గట్టిపోటీనిస్తున్న చైనా అంతరిక్ష రంగంలో కూడా ప్రధాన పోటీదారుగా నిలిచింది. చైనా అద్భుతమైన పరిశోధనలతో కొత్త కొత్త ఉపగ్రహాలతోపాటు ఎన్నో ఆవిష్కరణలు చేసింది. మరోవైపు అమెరికా ఈ మధ్యన పలు వైఫల్యాలు మూటగట్టుకున్నది. సూర్యునిపైకి గత ఏడాది పంపించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌, మార్స్‌పైకి పంపించిన ఇన్‌సైట్‌ మిషన్‌ మినహాయిస్తే అమెరికా ఇటీవల సాధించిన గొప్ప విజయాలేమీ లేవు. పైగా అంగారక గ్రహంపై ఉన్న ఆపర్చ్యూనిటీ, క్యూరియాసిటీ అనే నాసా రోవర్లు మూగబోయాయి. అలాగే రెండు అతిపెద్ద టెలిస్కోప్‌లు తమ పనిని ఆపివేశాయి. హబుల్‌ టెలిస్కోప్‌లోనూ సాంకేతిక లోపాలు తలెత్తాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప టెలిస్కోప్‌ పేరుతో జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌టెలిస్కోప్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నానా తంటాలు పడుతోంది. రెండు దశాబ్దాలుగా అది పూర్తికావడం లేదు. పైగా ఈమధ్యనే దాని ఆవిష్కరణను మరో రెండేళ్లు పొడిగించారు. చివరకు కొత్త పరిశోధనలు చేతకాక ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థలకు అమెరికన్‌ కాంగ్రెస్‌ దారులుతీసింది. దీంతో స్పేస్‌ఎక్స్‌, బ్లూఆరిజన్‌, వర్జిన్‌ గాలాక్టిక్‌, ఆరియన్‌ స్పాన్‌, స్పేస్‌ అడ్వంచర్స్‌ వంటి సంస్థలు అంతరిక్ష మార్కెట్‌కు తలుపులు తెరిచాయి. మార్స్‌పైకి, చందమామపైకి టూరిస్టులను కూడా తీసుకువెళ్తామని ఈ సంస్థలు చెపుతున్నాయి. పనిలోపనిగా రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్‌, కాస్మోకుర్స్‌ సంస్థలు కూడా అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించాయి.
ఇంత జరిగినా, చైనా అంతరిక్ష పరిశోధనలకు అమెరికా ధీటైన పోటీని ఇవ్వలేకపోతున్నది. చైనా కృత్రిమ చందమామలను సైతం రూపొందిస్తున్నది. దీంతో చైనాపై దుమ్మెత్తిపోయడమే అమెరికా తన పనిగా పెట్టుకున్నది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అంతరిక్ష పోరు కూడా తీవ్రతరమైంది. వాస్తవానికి ఎవరి పరిశోధనలు వారివే. ఏ పరిశోధనలైనా, ఆవిష్కరణలైనా అవన్నీ మానవాళి అభ్యున్నతి కోసమే, మనిషి మనుగడ కోసమే. అగ్రరాజ్యం ఈ విషయాన్ని గ్రహించడం అత్యంత అవశ్యం.

DO YOU LIKE THIS ARTICLE?