అగ్ర‌రాజ్యానికి ఏమైంది?

వాషింగ్టన్ : అమెరికా ఈ ప్ర‌పంచంలోనే అగ్ర‌రాజ్యం. ఆ దేశం ఏమైనా చేయ‌గ‌ల‌దు. కానీ మ‌హమ్మారి క‌రోనా విష‌యంలో అమెరికా ఏమీ చేయ‌లేక‌పోతున్న‌ది. చివ‌ర‌కు చైనాపై అబాంఢాలు వేయ‌డం త‌ప్ప నిస్స‌హాయంగా నిల్చున్న‌ది. మ‌న‌దేశంలో క‌నీసం శుచి, శుభ్ర‌త‌, సామాజిక దూరం వంటి సూత్రాల‌తో క‌రోనాను కాస్త‌యినా అదుపు చేయ‌గ‌లుగుతున్నాం. కానీ అమెరికాలో అప్ప‌టికే క‌రోనా వ్యాపించ‌డంతో ప్రాణాలు రాలిపోతున్నాయి. కరోనా మహమ్మారికి అగ్రరాజ్యంలో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాలో క‌రోనా కేసుల సంఖ్య 1,04,256కి చేరుకున్న‌ది. శ‌నివారం నాటికి చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో అగ్ర‌స్థానంలో నిలిచిన అమెరికా లక్ష మార్క్ దాటిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లక్ష కేసులు నమోదైన దాఖలాలు లేవు. అలాగే ఇప్పటి వరకు 1704 మంది వైరస్ బారిన పడి మరణించారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్నిడోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దించారు. ఇప్పటికే అన్ని మార్గాల్ని అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేతసౌధం.. ఆఖరి అస్త్రాల్లో ఒకటైన డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని కూడా తాజాగా అమల్లోకి తెచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. అరుదుగా ప్రయోగించే ఈ చట్టం ద్వారా దఖలు పడే అధికారాలతో ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ను.. ఆపత్కాలంలో రోగగ్రస్థులకు ఊపిరి పోసే వెంటిలేటర్ల తయారీకి ఆదేశించింది. ఇదే బాటలో ఫిలిప్స్, మెడ్ ట్రోనిక్ , హామిల్టన్, జోల్, రెడ్ మెడ్ తోనూ ఒప్పందం కుదుర్చుకొంది. రానున్న వారం రోజుల్లో లక్ష యూనిట్లను అందుబాటులోకి తేనున్నామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మహమ్మారిని మట్టుబెట్టేందుకు పాలకపక్షం అన్ని చర్యలు తీసుకుంటోందని పునరుద్ఘాటించారు. వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. క‌రోనా కేసుల్లో చైనాను కూడా దాటిపోయిన అమెరికా ఏం చేయాల‌న్న అంశంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?