తెలంగాణలో ఒకే రోజు 61 కరోనా కేసులు
మీడియాఫైల్స్ / హైదరాబాద్ : తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. కాకపోతే మరణాల సంఖ్య పెరగకపోవడం సంతోషకరమైన విషయం. సోమవారం కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 17కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 592 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 17 మంది మరణించారు. 103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 472 మంది కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. ఈ యాక్టివ్ కేసుల్లో మరో మూడు రోజుల్లో చాలావరకు డిశ్చార్జి అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. కరోనాను అదుపు చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సోమవారం ఒక్కరోజే 61 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ, ఈ తాకిడి మరో వారం రోజుల్లో తగ్గవచ్చని భావిస్తున్నారు. కరోనా పరిస్థతి తీవ్రంగా వుండబట్టే రాష్ట్రంలో లాక్డౌన్ను ఈనెలాఖరు వరకు పొడిగించారు.