జిహెచ్ఎంసిపై హైకోర్టు నిప్పులు

మీడియాఫైల్ లీగ‌ల్‌/ హైదరాబాద్‌ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జిహెచ్ఎంసి) అధికారుల‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కాలుష్య కోర‌ల్లో హైద‌రాబాద్ న‌గ‌రం న‌లిగిపోతుంటే అధికారుల‌కు ఎలా నిద్ర‌ప‌ట్టింద‌ని దుయ్య‌బ‌ట్టింది. “కాలుష్య కోరలు చాచింది. జీహెచ్ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే 8 ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది. కేసులు పడ్డప్పుడు మూడు ఇండ్రస్టీస్‌ నుంచే పొల్యూషన్‌ వెలువడుతోందని జీహెచ్ఎంసీ చెప్పింది. అనుమానం వచ్చి హైకోర్టు కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటే 345 ఇండస్ట్రీస్‌ నుంచి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది. దీంతో జీహెచ్ఎంసీ కళ్లు తెరిచి 3 కాదు 198 ఇండస్ట్రీస్‌ నుంచి కాలుష్య సమస్య ఉందని మరో అఫిడవిట్‌ వేసింది. 2012 నాటి పిల్స్‌పై అప్పుడే జీహెచ్ఎంసీ, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి కలిసికట్టుగా పనిచేసుంటే 198 నుంచి 345కు పెరిగేవి కాదు. కాలుష్యం వల్ల జనం అల్లాడిపోతున్నారు. అయినా అధికారులకు పట్టడం లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఉంటే అధికారులను కూడా వదిలిపెట్టేది లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు..” అని హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇలాగే వదిలేస్తే కాలుష్యంలో డిల్లీ, ముంబైల కంటే ముందుకు మన హైదరాబాద్‌ ఉంటుంది. 2016లో పొల్యూషన్‌ వల్ల సమస్యలున్న పరిశ్రమలపై చర్యలకు వీలుగా రాష్ట్ర సర్కార్‌ జీవో ఇస్తే దానిని అమలు చేయలేదని జీహెచ్ఎంసీ చెప్పడాన్ని ఎలా తీసుకోవాలి? నిజాయితీగా ఒప్పుకున్నందుకు అభినందించాలా లేక 2016 నాటి జీవో అమలు చేయలేదని నిందించాలా.. అని ప్రశ్నించింది. 2012 నాటి పిల్స్‌పై తగిన చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ చెప్పడంపై హైకోర్టు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇకమీదటైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక శాస్త్రిపురంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై సమగ్ర నివేదికను అందజేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చింది. .పొంతన లేని వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయడంపై వివరణ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు బుధవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. 98 ఇండస్ట్రీస్‌ను మూసేశామని, 198 పరిశ్రమలకు నోటీసులుఇచ్చామని, అవిఇచ్చే రిప్లయ్స్‌ను బట్టి మూసివేత చర్యలు తీసుకుంటామని, వాటన్నింటికీ ఈ నెల 2నే నోటీసులు ఇచ్చామని కమిషనర్‌ హైకోర్టుకు వివరించారు. ఆలస్యం చేసినందుకు క్షమాపణలు చెప్పారు.  2012 నాటి కేసులో ఉన్న కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్రపోతున్నారా లేక కోమాలా ఉన్నారా అని ప్రశ్నించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ సమర్పించిన నివేదికల్లో పొంతన లేని అంశాలు ఉండటంపై హైకోర్టు గతంలోనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక రిపోర్టులో మూడు పరిశ్రమలే ఉన్నాయని చెప్పారని, గట్టిగా ప్రశ్నిస్తే 198 పరిశ్రమలు ఉన్నాయని మరో నివేదికలో చెప్పారని ధర్మాసనం తప్పుపట్టింది. కాలుష్య పరిశ్రమలపై తాము న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రమణ్యంతో తెప్పించుకున్న నివేదికలో శాస్త్రిపురంలో సుమారు 250 పరిశ్రమలు ఉన్నాయని తమ వద్ద సమాచారం ఉందని ధర్మాసనం వెల్లడించింది. జీహెచ్ఎంసీ ఆలస్యం వల్ల వాటి సంఖ్య 345కు పెరిగిందని చెప్పింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 7వ తేదీలోగా కౌంటర్‌ వేయాలని, అదే తేదీన విచారణ చేస్తామని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?