కరోనా కట్టడికి చర్యలు
మీడియాఫైల్స్/హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ ఉపక్రమించింది. పాఠశాలలకు, కళాశాలలకు, సినిమా ధియేటర్లకు స్వస్థి పలికింది. వాటన్నింటినీ పదిహేను రోజులు మూసివేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రజలేవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ తీసుకున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా రూ. 500 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించామని, దీనిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దనే ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రదర్శనలు, ర్యాలీలు, బార్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల, కోచింగ్ సెంటర్లు, పబ్బులను మార్చి 31 వరకు బంద్ చేయనున్నట్లు తెలిపారు. దీనిని అతిక్రమిస్తే విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహారిస్తామని, వారి అనుమతులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఇది ఎప్పటికప్పుడు సమావేశమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నివేదికను అందజేస్తుందన్నారు. ‘కరోనా వైరస్’ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అత్యవసరంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ అసెంబ్లీ హాల్లో సమావేశమైంది. మంత్రివర్గ సమావేశనంతరం కెసిఆర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కరోనా వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదని, భయోత్పాతం కావాల్సిన అసవరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు లేవని భరసనిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎవ్వరూ అయోమయానికి గురికావొద్దని సూచించారు. జనసమ్మర్ధం ఉండే వద్దకు ప్రజలు పోవద్దని, ఇలాంటి వద్దకు వెళ్లకుండా కొంత పక్కన ఉండడమే అతిముఖ్యమని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, న్యూఢిల్లీలో కొన్ని చర్యలు తీసుకుందని,కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు, సలహాలు అందిస్తుందని వివరించారు.
సర్వసన్నద్ధం
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు, ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉన్నదని, దీనికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తామని సిఎం అన్నారు. రూ.500 కోట్లు ప్రత్యేక నిధిని ప్రధాన కార్యదర్శి వద్ద ఉంటుందని, ఆయన దీనిని ఉపయోగించేందుకు ఆయనకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని వివరించారు. విదేశాల నుండే వచ్చిన వారితోనే వైరస్ సోకుతుందని, అయితే మనకు పోర్టులు లేవని, ఉన్న ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చర్యలు తీసుకున్నామని తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారితోనే ప్రమాదం కాబట్టి హైదరాబాద్ శివారు ప్రాంతాలకే కొంత పరిమితమని, గ్రామీణ ప్రాంతాలకు వైరస్ ప్రమాదం లేదని చెప్పారు. 15 రోజుల షెడ్యూల్లో భాగంగా ఇందులో ఇప్పటి నుండి 31 వరకు జనసమర్ధం ఉన్న ప్రాంతాలను నియంత్రణ చేయాలని, విద్యా సంస్థలు, ప్రైవేటు నుండి ప్రభుత్వం వరకు మూసివేయాలని, దీనిని అతిక్రమిస్తే తీవ్రమైన చర్యలు, వారి పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెన్సిలయ్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాసేవరకు వారికి హాస్టల్ వసతి కొనసాగుతుందని తెలిపారు. ఇది వరకే వివాహాలను బుక్ చేసుకున్న వారికి మాత్రమే మ్యారేజ్ హాల్స్,ఫంక్షన్ హాల్స్‌ను అందుబాటులో ఉంటాయని, ఈ నెల 31తర్వాత వివాహాలు, ఫంక్షన్లకు మ్యారేజ్ హాల్స్, ఫంక్షన్ హాల్స్‌లలో అనుమతినిరాకరించాలని దీనిని కచ్చితంగా నిర్వాహకులు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల పాటు సినిమా థియేటర్లు, బార్లు, క్లబ్‌లు, పబ్బులు,ఇండోర్ అవుడోర్ స్టేడియం, జిమ్స్, జూపార్కులు, మ్యూజియం మూసివేయాలని ఆదేశించారు. అలాగే బహిరంగ సభలు, సమావేశాలు, సదస్సులు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్లు, కల్చరల్ ఇవెంట్స్ తదితర కార్యక్రమాలు కూడా ఈ నెల 31 వరకు అనుమతులు ఇవ్వకూడదని తెలిపారు. అయితే రైళ్లు, బస్సులు యధావిధిగానే నడుస్తాయని, అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర వస్తువులు లభించే సూపర్మార్కెట్లు, మాల్స్, స్టోర్స్, షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అంతే….
కొందరు అతిగాళ్లు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇసారి చట్టం అంటే ఏమిటో వారు రుచిచూస్తారని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. ఎలక్ట్రానిక్మీడియా కూడా అతిగా ప్రచారం చేశారని, వారిపై కూడా నియంత్రణ ఉంటుందని చెప్పారు. కొందరు ఆయా ప్రాంతాల్లో కరోనా సోకిందని తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఇలా తోకా తొండం అని రాస్తే క్షమించాబోమని, ఇక నుండి ఆరోగ్య శాఖ నిర్ధారించిందే రాయాలని సూచి ంచారు. తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము మీడియా స్వేచ్ఛను హరించడం లేదని, అలాగే తప్పుడు ప్రచారం, భయోత్పాతం సృష్టించే సహించబోమన్నారు. తాము ఇంత చెబుతున్నప్పటకీ ప్రచారం చేస్తే కఠిన మైన చర్యలు తీసుకంటామని, వారిని ఎవ్వరూ కాపాడలేరని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేలా మీడియా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాలు, చర్చీలు, మసీదులు శుభ్రంగానే ఉంటాయని, అయినప్పటికీ శుభ్రపర్చాలని సూచిస్తా మన్నారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను బట్టి శ్రీరామ నవమి పండగ విషయంలో ఆలోచిస్తామని సిఎం వివరించారు.
కరోనా ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు:
మొదటి దశలో కొన్ని అంశాల్లో మార్చి 31 వరకు, కొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ.
జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నియంత్రణ.
మార్చి 21 వరకు అన్ని రకాల విద్యాసంస్థలతు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపుల మూసివేత
బోర్డు పరీక్షలు యధాతథంగా జరుగుతాయి
పరీక్షలు రాసే విద్యార్ధులకు హాస్టల్ వసతి కొనసాగుతుంది.
ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కుటుంబ సభ్యుల మధ్యే చేసుకోవాలి. 200 మంది లోపే హాజరయ్యేలా చూసుకోవాలి. మార్చి 31 వరకు తదుపరి మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ బంద్.
వారం రోజుల పాటు నియంత్రణ చర్యలు
బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్స్, ఉత్సవాలు, ర్యాలీలకు,ఎగ్జిబిషన్స్, ట్రేడ్ ఫేర్స్, కల్చరల్ ఈవెంట్స్‌లకు అనుమతులు ఇవ్వబడవు
సినిమా హాళ్లు, బార్లు, పబ్‌లు, మెంబర్షిప్ క్లబ్బుల మూసివేత
ఇండోర్, ఔట్‌డోర్ స్పోర్ట్ స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లు, జిమ్మాజియమ్స్, జూపార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యూజియమ్స్ మూసివేత
అన్నిరకాల స్పోర్ట్ ఈవెంట్ రద్దు
అన్ని రకాల ఆర్టిసి బస్సులు, మెట్రో రైలు యధాతథంగా నడుస్తాయి
బస్సుల్లో, రైలల్లో నిరంతరం శానిటైజేషన్ పనులు చేయడం జరగుతుంది.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన చర్యలు:
ఎయిర్ పోర్టులో సర్వైలెన్స ఏర్పాటు
1020 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి
321 ఐసియు బెడ్స్ ప్రత్యేకంగా కరోనా కోసం ఏర్పాటు
240 వెంటిలేటర్స్ సిద్ధంగా ఉన్నాయి
రాష్ట్రంలో 4 క్వారంటైన్ ఫెసిలిటీస్
రూ.500 కోట్ల ప్రత్యేక నిధి సిసిఎస్ డిప్పోజల్
ప్రత్యేక టాక్స్‌ఫోర్స్
వైద్యారోగ్యశాఖ, మున్సిపాల్, పంచాయతి రాజ్, పోలీస్ శాఖల అధికారులతో ఏర్పాటు
ప్రభుత్వం నుంచి కన్ఫామ్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడయాఓ ప్రచారం చేసే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.