విద్యుత్‌, బ్యాంకు స్టాక్‌లను దెబ్బతీసిన కరోనా

ముంబయి: మరోసారి కరోనా ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేసింది. గురువారంనాడు ముఖ్యంగా విద్యుత్‌, బ్యాంకింగ్‌ రంగాలను దెబ్బతీసింది. ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాలనే చవిచూశాయి. కరోనావైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రభావం చూపొచ్చన్న భయాలు బాగా అలుముకున్నాయి. దాంతో ఆ విషయం మదుపరుల సెంటిమెంట్‌లపై బలంగా పనిచేసింది. ‘దేశీయ మార్కెట్‌ మధ్యాహ్నం సెషన్‌లో కొంచెం పుల్‌బ్యాక్‌ కనిపించినప్పటికీ అది ఎంతోసేపు నిలవలేదు’ అని ఆనంద్‌ రాథి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ రిసెర్చ్‌(ఫండమెంటల్‌) హెడ్‌ నరేంద్ర సోలంకి అభిప్రాయపడ్డారు. బిఎస్‌ఇలో లోహ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, విద్యుత్తు, పారిశ్రామిక సూచీలు 7.17 శాతం మేరకు నష్టపోయాయి. కాగా టెలికామ్‌ సూచీ లాభాల్లో నిలిచింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 4.53 శాతం మేరకు నష్టపోయాయి. దేశీయ స్టాకు మార్కెట్‌లు గురువారం వరుసగా నాలుగో రోజున కూడా నష్టపోయాయి. కరోనావైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న భయాలతో రిస్కీ అసెట్స్‌ నుంచి మదుపరులు తప్పుకున్నారు. మధ్యాహ్నం ట్రేడ్‌లో కాస్త పాజిటివ్‌గా కనిపించినపటికీ ఆ తర్వాత ఆసియా మార్కెట్‌ల బాటను దేశీయ మార్కెట్లు పట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 581.28 పాయింట్లు లేక 2.01 శాతం నష్టపోయి 28,288.23 వద్ద స్థిరపడింది. అయితే గురువారం సెషన్‌లో సెన్సెక్స్‌ దాదాపు 2,656.07 పాయింట్ల మేరకు ఊగిసలాడింది(స్వంగ్‌). ఇక ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 205.35 పాయింట్లు లేక .42 శాతం నష్టపోయి 8,263.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 7,900 పాయింట్ల దిగువ స్థాయిని కూడా తాకింది. సెన్సెక్స్‌ ప్యాక్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ 10.24 శాతం నష్టపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. మారుతి 9.85 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 9.50 శాతం, ఎం అండ్‌ ఎం 9.28 శాతం, టెక్‌ మహీంద్ర 8.43 శాతం, ఒఎన్‌జిసి 7.35 శాతం నష్టపోయాయి. కాగా ఐటిసి, భారతి ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, హీరోమోటో కార్పొరేషన్‌ షేర్లు లాభపడ్డాయి.

DO YOU LIKE THIS ARTICLE?