స్టాక్ మార్కెట్ బదాబదాల్
ముంబయి: కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. స్టాక్‌మార్కెట్ బదాబదలైంది. పతనంలో స్టాక్స్ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగనిరీతిలో స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టని మదుపుదారులకు చెందిన దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఒక్కసారిగా ఆవిరైంది. ఒక్క భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. అమెరికా ఎన్నడూ లేనంతగా డౌజాన్ పతనాన్ని చవిచూసింది. 2 వేలకు పైగా పాయింట్లను అగ్రరాజ్యం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిని అమెరికా కూడా ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఇక భారత స్టాక్ మార్కెట్లు గురువారం బేర్ మన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండడం, కరోనావైరస్ను అడ్డుకునేందుకు వచ్చే 30 రోజులపాటు బ్రిటన్ సహా అన్ని ఐరోపా దేశాలకు రాకపోకలు నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, తదితరాలు ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మాంద్యం భయాలను సృష్టిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజికి చెందిన నిఫ్టీ 50 సూచీ 8.3 శాతం పతనమై 9,590.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 2.5 సంవత్సరాల కనిష్ఠానికి జారుకుంది. ఇక బిఎస్ఇ సెన్సెక్స్ సూచీ 8 శాతం పతనమై 32, 778. 14 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారత స్టాకు మార్కెట్లు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంతలా పడిపోవడం అన్నది ఇప్పుడే. వైరస్ భయాలకు తోడు, చమురు ధరలు, భారత ఆర్థికవ్యవస్థ మందగమనం కూడా మార్కెట్ పడిపోవడానికి కారణమైంది. దలాల్‌స్ట్రీట్‌లో మదుపరుల సంపద ఒక్క రోజునే రూ. 11,27,160.65 కోట్లు ఆవిరైపోయాయి.