ఇండియాలోరెండో కరోనా మరణం
న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే భారత్లో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా కరోనా వైరస్ సోకిన మరో వ్యక్తి మరణించారు. మన దేశంలో ఇది రెండో కరోనా మృతి. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కరోనాతో మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో శుక్రవారం అంతిమశ్వాస విడించింది. మృతిచెందిన మహిళ కుమారుడు గత నెలలో ఇటలీ, స్విట్జర్లాండ్లలో పర్యటించి మన దేశానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తల్లీకొడుకులిద్దరికీ అనుమానంతో ఈనెల 7న పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికీ కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అయితే కుమారుడు ఆ రోగం నుంచి కోలుకోగా, డయాబెటిస్, బిపి వంటి వ్యాధులు ఉన్న తల్లి మాత్రం ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది.