సంజూ శాంసన్‌ సిక్సర్ల మోత!

చెన్నైపై రాజస్థాన్‌ అద్భుత విజయం

షార్జా : సంజూ శాంసన్‌, జోఫ్రా ఆర్చర్‌లు సిక్సర్లతో షార్జా స్టేడియంలో మోత మోగించారు. షార్జా క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై విజయం నమోదు చేసిన చెన్నై ఈ మ్యాచ్‌లో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపిఎల్‌లో తొలిసారిగా భారీ స్కోరు నమోదైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన నాల్గవ ఐపిఎల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ అనూహ్యమైన రీతిలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు భారీ స్కోరు నమోదు చేయగా, చెన్నై సూపర్‌కింగ్స్‌ 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. పదికి పైగా రన్‌రేట్‌తో లక్ష్యాన్ని నిర్ధారించుని పోరాడిన చెన్నై పరుగుల వేటలో చతికిల పడింది. రాహుల్‌ తెవాటియా చెన్నై టాప్‌ఆర్డర్‌ను దెబ్బతీయడంతో పరుగుల వేగం మందగించింది. అయితే ఫఫ్‌ డుప్లెసిస్‌, ధోనీలు సిక్సర్లతో చివర్లో మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డుప్లెసిస్‌ కేవలం 37 బంతుల్లో 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 72 పరుగులు చేయగా, ధోనీ మూడు సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. షేన్‌ వాట్సన్‌ (33), కేదార్‌ జాదవ్‌ (22)లు కొంత మేరకు రాణించారు. రాజస్థాన్‌ బౌలర్లలో రాహుల్‌ తెవాటియా మూడు వికెట్లు, టామ్‌ కుర్రన్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌లు ఒక్కొక్క వికెట్టు తీసుకున్నారు.
అంతకుముందు టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ తొలుత రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. శాంసన్‌ కేవలం 32 బంతుల్లోనే ఏకంగా 9 సిక్సర్లు, ఒక బౌండరీతో 74 పరుగులు చేశాడు. కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌తో కలిసి అతను రెండో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఒక దశలో వీరి భాగస్వామ్యాన్ని విడదీయడం చెన్నైకి తలనొప్పిగా మారింది. స్మిత్‌ కేవలం 47 బంతుల్లో నాలుగేసి ఫోర్లు, సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ ఊహించని విధంగా బ్యాట్‌ ఝుళిపించి, కేవలం 8 బంతుల్లో 4 సిక్సర్లు కొట్టి 27 పరుగులు చేసి ధోనీ సేనకు షాక్‌ తినిపించాడు. ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్‌ ఏకంగా 30 పరుగులు చేయడం గమనార్హం. చెన్నై బౌలర్లలో శామ్‌కుర్రన్‌ మూడు వికెట్లు తీసుకోగా, దీపక్‌ చాహర్‌, లుంగీ ఎన్‌గిడి, పీయూష్‌ చావ్లాలు ఒక్కొక్క వికెట్టు తీసుకున్నారు. సంజూ శాంసన్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా, ఇప్పటివరకు ఐపిఎల్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు ఒక్కొక్క మ్యాచ్‌ గెలిచిన విషయం విదితమే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా, హైదరాబాద్‌ ఇంకా రెండు బంతులు మిగిలి వుండగానే 153 పరుగులకే ఆలౌట్‌ అయింది.

DO YOU LIKE THIS ARTICLE?