సిఎం ప‌ద‌విపై కోరిక లేదు : రజనీకాంత్‌

చెన్నై: ముఖ్యమంత్రి పద‌విపై త‌న‌కు ఏనాడూ కోరిక లేదని, అది తన కల కూడా కాదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ప్ర‌క‌టించారు. ఆయన 2017 డిసెంబర్‌ 31 తర్వాత తొలిసారిగా గురువారం చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన పార్టీ రాజకీయాల్లోకి వస్తుందని, గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందని, అయితే ముఖ్యమంత్రిగా ఓ విద్యావంతుడినే తమ పార్టీ నుంచి ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. తన పార్టీలో 45 ఏళ్లకన్నా తక్కువ వయస్సు ఉన్న యువతకు తగిన ప్రాధాన్యతనిస్తానన్నారు. రిటైర్డ్‌ జడ్జిలు, ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ వంటి పదవులు నిర్వహించిన వారు పార్టీలో ఉంటారన్నారు. ‘నేనే స్వయంగా వారిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాను’ అని కూడా చెప్పారు. 71 ఏళ్ల వయస్సు ఉన్న రజనీకాంత్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని తెలుస్తోంది. తనకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఛాన్స్‌ ఒకటే ఉందని ఆయన భావోద్వేగంతో చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త నెత్తురును ఎక్కించాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు. అవినీతి రహిత, సౌభాగ్యవంతమైన తమిళనాడును తాను కోరుకుంటున్నానన్నారు. తన ఉద్దేశాలు గ్రహించి ప్రజలు తనకు మద్దతునివ్వాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?