అమ‌ర‌వీరునికి క‌న్నీటి వీడ్కోలు

మీడియాఫైల్స్‌/సూర్యాపేట‌ : స‌రిహ‌ద్దు వీరునికి జ‌నం క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన అమర జవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేసారం గ్రామ సమీపంలో ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛ‌నాలతో జరిగాయి. సోమవారం అశువులు భాసిన సంతోష్‌బాబు పార్ధీవదేహం ఆయన స్వస్థలమైన సూర్యాపేటకు బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక వాహనం ద్వారా చేరుకుంది. ప్రజల, బంధువుల సందర్శనార్థం విద్యానగర్‌లోని తన నివాసంలో ఉదయం 9గంటల వరకు ఉంచారు. ప్రజలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై ఆయన పార్ధీవదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన తల్లిదండ్రులను, భార్యను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. కల్నల్‌ సంతోష్‌బాబును స్మరించుకుంటూ దేశ రక్షణకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాని కీర్తించారు. అనంతరం అధికారులు అంత్యక్రియలకు సంబంధించి కుటుంబసభ్యులను సంప్రదించి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రతినిధిగా సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. పట్టణంలో ఆయన అంతిమ యాత్ర నిర్వహించగా అమర జవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు కడసారి చూసేందుకు వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు కరోనా వైరస్‌ను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు. కల్నల్‌కు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్‌ తన తనయుడికి దహన సంస్కారాలను మనవడు అనిరుద్‌ తేజను ఎత్తుకొని నిర్వహించారు. మిలటరీ జవాన్లు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. కల్నల్‌ ఆర్మీ యూనిఫాంను తన సతీమణి సంతోషికి అందజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?