చమురు…మాంద్యం…కరోనా!

భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. చమురు…మాంద్యం…కరోనా… ఈ మూడూ ప్రపంచాన్ని వేధిస్తుండగా, భారత్‌పై దాని ప్రభావం మరీ ఎక్కువగా వుంది. బ్లాక్‌ మండే…బ్లాక్‌ ఫ్రైడే…ఏదో ఒక బ్లాక్‌డేతో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్యాకేజీలు తెచ్చినా చివరకు అవి వైఫల్యబాటనే చూపుతున్నాయి. ఓవైపు వెంటాడుతున్న కరోనా భయాలు.. మరోవైపు ఆర్థిక మాంద్యం ఆందోళనలు.. చమురు ధరల పతనం.. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లకు సోమవారం (2020 మార్చి 16) మరో బ్లాక్‌ మండేగా మిగిలింది. గత వారం కూడా మదుపరులకు చెందిన 11 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఈసారి కూడా అంత గొప్ప నష్టం లేకపోయినా, నష్టమైతే సంభవించింది. ఈ పరిస్థితి ఇంకా దయనీయంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. భారత్‌, అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సోమవారం ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లో సాగాయి. ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో సూచీలు చివరి గంటల్లో మరింత కుంగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 2,800 పాయింట్ల కిందకు పడిపోయింది. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 2,713.41 పాయింట్లు పతనమై 31,390.07 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్‌ నాటి ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 7.96శాతం తగ్గింది. ఇక నిఫ్టీ కూడా 7.61శాతం నష్టంతో 757.80 పాయింట్లు దిగజారి 9,197.40 వద్ద ముగిసింది. ఎన్‌ఓఎస్‌ఈలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌ఓడబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ సహా దాదాపు అన్ని షేర్లు భారీగా నష్టపోయాయి. విచిత్రమేమింటే, కష్టాల్లో ఉన్న ఒక్క యెస్‌ బ్యాంక్‌ మాత్రమే లాభపడింది. దాని పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా వివిధ సంస్థలు దాంట్లో పెట్టుబడులు పెట్టడమే అందుకు కారణం. ఇంకోవైపు, రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది. ట్రేడింగ్‌ ప్రారంభమయ్యాక ఒక దశలో రూ.74.50కు చేరింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొంది. ఎఫ్‌ఐఐల విక్రయాల ఒత్తిడి ప్రభావం, బంగ్లాదేశ్‌తో భారత్‌ 2 బిలియన్‌ డాలర్లకు స్వైపింగ్‌ చేసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి.
ఇదొక భారత్‌నే కాదు…ఐరోపా మార్కెట్లు సైతం సోమవారం మధ్యాహ్నం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంగ్లాండ్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ100.. 5శాతానికి పైగా, ఫ్రాన్స్‌కు చెందిన సీవోసీ40.. 8శాతానికి పైగా, జర్మనీకి చెందిన డీఏఎక్స్‌.. 6శాతానికి పైగా, స్విస్‌ ఇండెక్స్‌లు.. 5శాతానికి పైగా పతనం అయ్యాయి. మరోపక్క ఆస్ట్రేలియా (9శాతం) షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ (3శాతం), హాంకాంగ్‌ (4శాతం), జపాన్‌కు చెందిన నిక్కీ(2శాతం), తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ(4శాతం)కు పైగా విలువను కోల్పోయాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లేవీ లాభాల్లో లేకపోవడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల నుంచి అతిభారీ నష్టాల్లోకి జారుకొన్నాయి.
ఆర్‌బిఐ ప్రెస్‌మీట్‌ కూడా ఒక విధంగా సోమవారంనాటి మార్కెట్‌ను కొంపముంచింది. మార్కెట్లు ముగిసిన తర్వాత ఆర్‌బీఐ అత్యవసర ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే, ఏం కబురు వినాల్సి వస్తుందోననే ఒత్తిడితో మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో భారత్‌ కూడా అదే బాటను పట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. సంక్షోభం ముందు అత్యవసర చర్యగా దీనిని భావిస్తున్న మార్కెట్లు ఏం జరుగుతుందోనని ఆందోళనకు లోనయ్యాయి. దీంతో పరోక్షంగా ఆర్‌బిఐ ఈ మార్కెట్‌ను దెబ్బతీసింది.
అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో అక్కడ కూడా బ్లాక్‌ మండే తప్పదనే భావన మొదలైంది. అక్కడి ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్‌ సూచీ ఉదయం 8.05 సమయంలో 4.8శాతం కుంగి 128.5 పాయింట్లు నష్టపోయింది. డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ కూడా 1,041 పాయింట్లు పతనమై 4.6శాతం నష్టాల్లో కొనసాగుతోంది.. ఇక నాస్‌ సూచీ కూడా 4.5శాతం పతనమైంది. దీంతో అమెరికా మార్కెట్లు బేర్‌ మార్కెట్లను వీడలేదనే మదుపర్లు అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్ల తగ్గింపు అమెరికా మదుపరుల్లో అనుమానాలను పెంచింది. వాస్తవానికి ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపుతో దేశీయ స్టాక్స్‌ పెరగాలి. ఇది సాధారణ సమయంలో జరిగేది. కానీ, ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సమయంలో ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించిందంటే అది ప్రతికూల సంకేతాలను పంపించినట్లే. 2008 నాటి ఆర్థిక సంక్షోభంలో కంపెనీలకు లిక్విడిటీ పెంచడానికి ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించింది. ఇప్పుడు కూడా అటువంటి సంక్షోభమే వస్తోందేమోననే భయాలు ఇన్వెస్టర్లను పీడిస్తున్నాయి.
ఇదిలావుంటే, భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రమైపోతుందనే సంకేతాలు మార్కెట్‌ను ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో చైనాను నిందించడానికి ఏమీ లేదు. మార్చి 12 నాటికి మొత్తం క్రియాశీల కరోనా కేసుల్లో 29 శాతం మాత్రమే చైనా నుంచి రాగా.. 71శాతం మిగిలిన ప్రపంచ వ్యాప్తంగా నమోదు కావడం ఆందోళనకరం. మరోపక్క ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ వ్యాధి తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఈ దేశాలు పూర్తిగా దిగ్బంధంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్‌తో వర్తకంపై దీని ప్రభావం ఉండొచ్చనే భయాలు నెలకొన్నాయి. తమ దేశంలో దాదాపు 70శాతం మంది కరోనా సోకే ప్రమాదం ఉందని జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కల్‌ వెల్లడించడం భయాలను మరింత పెంచేసింది. మరోపక్క ఓఈసీడీ అంచనాల ప్రకారం ప్రపంచ జీడీపీ వృద్ధిపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపనుందని తేలింది.ప్రస్తుత భయాందోళనలకు చమురు యుద్ధం తోడై మంటలను ఎగదోస్తోంది. అరబ్‌ దేశాల ఆదాయం పడిపోతే వివిధ వస్తువులపై డిమాండ్‌ కూడా తగ్గుతుంది. ఆయా దేశాలకు భారత్‌ ఎగుమతి చేసే వస్తువులు కూడా తగ్గిపోతాయి. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా పడనుంది. అపరజూ;నిల్వ చేసుకొనే సౌకర్యాలు లేక చమురు ధరల తగ్గింపును వినియోగించుకోలేని పరిస్థితి.. అరబ్‌ఓషఅ; దేశాలకు ఎగుమతులు పడిపోయే స్థితి నెలకొనడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశమే. దీనికి తోడు దేశీయ చమురు రంగ దిగ్గజమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 7శాతానికి పైగా నష్టపోవడం సూచీలను కుంగదీసింది. మరోపక్క చమురు రేట్లు మరొక డాలర్‌ మేరకు పతనం అయ్యాయి.
ఆర్థిక పరిస్థితిపై అపనమ్మకం ప్రధానంగా మదుపుదారులను కుంగదీస్తోంది. దేశంలో వరుసగా పలు ఆర్థిక సేవా సంస్థలు దివాలా తీస్తుండటం కూడా మదుపరుల భయాన్ని పెంచింది. ఇప్పటికే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఎల్‌ దెబ్బతినగా, ఇప్పుడు యస్‌ బ్యాంక్‌ సంక్షోభం కూడా వీటికి తోడైంది. శనివారం యస్‌ బ్యాంక్‌ రూ.18,564 కోట్ల నష్టం, రూ. 40వేల కోట్ల ఎన్‌పీఏలను ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. దీంతో యస్‌ బ్యాంక్‌ పునరుజ్జీవ పథకంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల షేర్లు నేడు నష్టాలబాట పట్టాయి. వీటిల్లో యస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి భారీ వెయిటేజీ ఉన్న షేర్లు ఉండటంతో సూచీలు కుంగాయి.
ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మార్గాలు లేకపోలేదు. అన్నింటికన్నా ముందుగా కరోనాపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుంది. అలా జరిగిననాడు దాని పట్ల భయాలు తొలగుతాయి. అదేసమయంలో రోగం వ్యాప్తి కూడా తగ్గుముఖం పడుతుంది. తద్వారా మార్కెట్లు పుంజుకుంటాయి. చైనాలో అదే జరుగుతోంది. మన దేశంలో కూడా చైనానే అనుసరించడం మేలు. ఇక చమురుధరల తగ్గింపు విషయంలో అమెరికా రాజకీయాలను ఆసియా దేశాలు ఎండగట్టిన రోజున సహజంగానే చమురు వ్యవహారం స్థిరీకరించబడుతుంది. ఆర్థిక మాంద్యం కుదుటపడిన రోజున ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?