వలస కార్మికుల ఆకలికేకలు
ముంబయి : వలస కార్మికుల ఆకలికేకలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్నందున లాక్డౌన్ ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డున పడ్డ వలస కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. తాజాగా ముంబయిలోని బాంద్రా పశ్చిమలో వేలాది మంది వలస కార్మికులు ఆందోళనబాట పట్టారు. లాక్డౌన్ను పొడిగిస్తూ మోడీ ప్రకటన చేసిన కొన్ని గంటలకే బాంద్రా వలస కార్మికులు బస్టాండ్ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. వీరంతా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తివేయడం కష్టసాధ్యమని భావించిన వారంతా తమ స్వంత ఊళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారంతా ఒకేసారి వీధుల్లోకి రావడం, పోలీసులతో గొడవకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఈ లాఠీఛార్జిలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. రోజుకు కనీసం 300 నుంచి 600 రూపాయలు సంపాదించుకునే ఈ కార్మికులకు గత నెల రోజులుగా పనిలేదు. ప్రభుత్వ సాయం అంతంత మాత్రంగానే వుండటంతో వీరు తిరిగి తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే పరిస్థితి హైదరాబాద్లో కూడా తలెత్తింది. కాకపోతే ఎక్కువమంది కాకపోవడంతో పోలీసులు వారికి సర్ది చెప్పగలిగారు.