తెలంగాణ‌లో 31 వరకూ లాక్‌డౌన్‌

మీడియాఫైల్స్‌/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మే నెల 31వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఈ రాష్ట్రంలో ఆంక్ష‌లు య‌థావిధిగా కొన‌సాగుతాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన దాదాపు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సమావేశానంతరం సిఎం కెసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించాలని, కేంద్రం ప్రకటించిన సడలింపులు రాష్ట్రంలో ఉండబోవని నిర్ణయించినట్లు ప్రకటించారు. వచ్చే నెల కూడా ఉచితంగా రేషను, నగదు అందజేస్తామని, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ సంస్థలపై నిషేధం విధిస్తున్నామని కెసిఆర్‌ తెలిపారు. కిరాయిదారులు మూడు నెలలపాటు ఇంటి అద్దెలు చెల్లించకుండా వాయిదా వేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెపాపరు. అలాగే కరోనా అదుపులో కృషి చేస్తున్న వైద్యులు, శానిటేషన్‌ సిబ్బందికి ప్రోత్సాహకాలు కొనసాగించడంతోపాటు పోలీసులకు పదిశాతం వేతనం అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్కూలు ఫీజులు పెంచితే కఠిన చర్యలు వుంటాయని, మత కార్యకలాపాలకు మే 31వ తేదీ వరకు అనుమతి వుండబోదని తెలిపారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని, సమస్యలు ఏమైనా వుంటే 100కు డయల్‌ చేయాలని కెసిఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ‌య‌ట‌కొస్తే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని చెప్పారు. రాత్రిపూట పూర్తిగా క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని, ప‌గ‌టిపూట నిత్యావ‌స‌రాల‌కు అనుమ‌తిస్తామ‌ని, కేంద్రం ప్ర‌క‌టించిన స‌డ‌లింపులు తెలంగాణ‌లో చెల్ల‌వ‌ని సిఎం స్ప‌ష్టంచేశారు.

DO YOU LIKE THIS ARTICLE?