దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. లాక్డౌన్ ఏప్రిల్ 14 నాటితో ముగిసిన నేపథ్యంలో కొత్తగా ఆంక్షలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోడీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి 25 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనాపై భారతదేశ యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతున్నదని, ఈ యుద్ధంలో ప్రతి పౌరుడూ పాల్గొని తన వంతు కృషి చేస్తున్నారని మోడీ అన్నారు. ఇప్పటివరకు ప్రజలంతా ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా కదనరంగంలోనే వున్నారని తెలిపారు. దేశం కోసం ప్రజలంతా ఇదే స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. ఇక నుంచి అదనంగా ఒక్క వ్యక్తికి కూడా కరోనా సోకకూడదని, ఒక హాట్‌స్పాట్ కూడా పెరగకూడదని, నిబంధనలను కఠినంగా పాటించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు పేదలు, కూలీలు ఎన్నో కష్టాలు పడ్డారని, వారికి కళ్యాన్ యోజన పథకం కింద తోడ్పాటునందిస్తామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కోరారు. ఎప్పటిలాగానే ప్రతి పౌరుడూ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌కు సహకరించాలని మోడీ పిలుపునిచ్చారు. “వుయ్ ద పీపుల్” అనే నినాదాన్ని సార్థకం చేయడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సంకల్ప శక్తిని ద్విగణీకృతం చేసుకొని, కరోనాపై పోరును నిబద్ధతతో కొనసాగించిననాడే అంబేద్కర్‌కు ఇచ్చిన నిజమైన ఘన నివాళి అవుతుందని మోడీ అన్నారు. మొదటి దశ పరీక్షలో ప్రజలంతా ఎంతో శ్రమించి నిలబడ్డారని, ఇప్పుడు రెండో దశ పరీక్ష వచ్చిందని, ఈ పరీక్షలోనూ జనం మరింత ద్విగిణీకృతంగా పనిచేయాలని మోడీ కోరారు. మే 20వ నుంచి అత్యవసర అనుమతులు ఇస్తామని, అయితే నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. 20వ తేదీన కొన్ని రకాల సడలింపులు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలంతా ఏడు సూత్రాలు కఠినంగా పాటించాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను కఠినంగ పాటించాలని, ఆయుష్ శాఖ నిబంధనలు పాటించాలని, ఆరోగ్య యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంట్లో పెద్దవారిని బాగా చూసుకోవాలని, కరోనా యోధులైన వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి గౌరవం ఇవ్వాలని, పేదలకు చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు.