22న జనతా కర్ఫ్యూ

ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పాటించాలని నరేంద్రమోడీ పిలుపు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తు అని వ్యాఖ్యానించారు. గురువారంనాడు మోడీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేస్తూ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూగా మోడీ అభివర్ణించారు. “జనతా కర్ఫ్యూ కోసం మీ మద్ధతును కోరుతున్నాను. ఈ కర్ఫ్యూ మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. స్వచ్ఛంద కర్ఫ్యూ వల్ల కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెరగడమే గాకుండా, ఆరోజుంతా వైరస్‌ను దరిచేరనీయకుండా మనందరం విజయం సాధించినట్లే అవుతుంది. స్వయం నియంత్రణకు ఇదొక సంకేతం అవుతుంది” అని మోడీ అన్నారు. ప్రపంచ మానవాళి మొత్తం కరోనా సంక్షోభం ఎదుర్కొంటోందని, రెండు నెలలుగా ఇది కొనసాగుతోందని చెప్పారు. ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును మనం ఎదుర్కొంటున్నామన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకతతో వ్యవహరించడం అవసరమని, అందరం చేయి చేయి కలిపి మహమ్మారిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, వీలైనంత వరకు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంట్లోంచే చేయాలన్నారు. వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుందని, అలాంటి తప్పనిసరి విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వవద్దని మోడీ కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయం కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నదని, ప్రపంచ దేశాలు దీన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని, ఇప్పుడే ఊరట లభించేలా కనిపించడం లేదన్నారు. వచ్చే కొద్ది వారాలు మీ అందరి సమయం ఇవ్వాలని మోడీ కోరారు. “ఇందుకు మన ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి దృఢ సంకల్పం. రెండోది కలిసి పోరాడటం” అని చెప్పారు. అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని, ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదని, ప్రజలంతా బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలన్నారు. అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దని పునరుద్ఘాటించారు. ప్రజలు పరస్పరం దూరం పాటించాలని, ఏకాంతంగా ఉండటం వల్ల ఈ మహమ్మారిని కట్టడి చేయొవచ్చని అన్నారు. అందుకే కరోనా నివారణ కోసం జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నానన్నారు. అందరం సంయమనంతో దీన్ని పాటిద్దామన్నారు. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సైరన్‌ మోగించాలని, ఆ సమయంలో ఇంట్లోని గుమ్మాలు, కిటీకీలు, బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు కొట్టి కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం తెలియజేద్దామని, ఈ మహమ్మారి తగ్గే వరకు అత్యవసర సర్జరీలు మినహా సాధారణ సర్జరీలు వాయిదా వేసుకుందామని చెప్పారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూద్దామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మోడీ ప్రస్తావిస్తూ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంచనా వేయడానికి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?