జనతా కర్ఫ్యూ ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ : జనతా కర్ఫ్యూ అనేది సాధారణమైన విషయం కాదు. అదొక గొప్ప ప్రయత్నం. ప్రధాని నరేంద్రమోడీకి ఈ సలహా ఇచ్చిన అధికారికి శెల్యూట్‌ చేయాల్సిందే. జనతా కర్ఫ్యూ వల్ల కరోనా వైరస్‌తో బలమైన పోరాటం చేసే అవకాశం దక్కుతుంది. కరోనాను చూసి బలహీనపడకుండా ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంది. అదెలాగంటే?…కరోనా వైరస్‌ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఓ వ్యాధి. ఇదొక కొత్త రోగం. ఈ వైరస్‌ను అదుపు చేసే మందును ఇంకా కనుగొనలేదు. కాకపోతే. దీని నియంత్రణ కోసం శాస్త్రవేత్తలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే ఈలోగానే జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాన్ని తప్పించి, ప్రాణాలు కాపాడుకోవాలంటే, ఉన్నంతలో ఆ వైరస్‌కు దూరంగా వుండటమే ఉత్తమం. అదే సమాజిక దూరం. సమూహంలో అత్యధికంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నట్లు ఈ వ్యాధికి గుర్తించినందున, సమూహాలకు దూరంగా వుండాలి. అంటే ఎక్కువమంది గుమిగూడి ఉన్న ప్రజలకు దూరంగా వుండాలి. అంటే మనమే గుమిగూడకుండా ఉండాల్సిన అవసరం వుంది. ఈ కరోనా వైరస్‌ ఎవరికి సోకినా అది 15 రోజుల్లో బలవర్ధకమవుతుంది. అంటే కనీసం పదిహేను రోజులపాటు మనకు మనమే నిర్బంధం విధించుకోవాలి. అదే స్వీయ నిర్బంధం. జనం కోసం, జనం చేత, జనమే చేపట్టే కర్ఫ్యూనే జనతా కర్ఫ్యూ. అంటే ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి రాకుండా ఇంట్లోనే ఉండటం, లేదా ఆఫీసులోనే వుండిపోవడమన్నమాట. ఆ విధంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కనీసం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మార్చి 22వ తేదీన జరిగే ఈ జనతా కర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొని, రోడ్లను నిర్మానుష్యం చేస్తే కచ్చితంగా వైరస్‌ మనల్ని వణికించదు….వైరెస్సే వణుకుతుంది. చైనాలో పాటించిన విధానమిదే. చైనా మినహా ఇతర దేశాలకు కరోనా వైరస్‌ పాకిన తర్వాత ఆయా దేశాల్లో అప్పటికే దాని పట్ల అవగాహన పెరిగింది. ప్రభుత్వాలు కూడా ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం దొరికింది. కానీ చైనాలో ఒక్కసారిగా కరోనా విరుచుకుపడింది. ఆ వైరస్‌ ఏంటనేది గుర్తించడానికే చాలా సమయం పట్టింది. ఈలోగా అది ప్రజల్లోకి వెళ్లిపోయింది. అయిప్పటికీ, చైనా వణికిపోలేదు, బెణకలేదు. సామాజిక దూరం సూత్రాన్ని పాటించి, వీలైనంత మేరకు కరోనాను కట్టడి చేసింది. ఈ వైరస్‌కు మందు కనిపెట్టే దాకా జనతా కర్ఫ్యూనే దీనికి మందు.

DO YOU LIKE THIS ARTICLE?