తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా 14 గంటలు కాకుండా 24 గంటలపాటు అంటే రోజంతా జనతా కర్ఫ్యూ పాటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది. 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ జనతా కర్ఫ్యూ నిర్వహించి ప్రజలంతా సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా వరండాల్లోకి వచ్చి చప్పట్ల ద్వారా మన వైద్యబృందానికి సంఘీభావం తెలియజేయాలని కోరారు. చప్పట్లపై సోషల్‌మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు సరికాదని, దీన్ని వెటకారంగా భావించి, కామెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కెసిఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ర్టంలో ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలు సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి బస్సు, ఇతర సర్వీసులను కూడా ఆపివేస్తామని కెసిఆర్‌ ప్రకటించారు.

DO YOU LIKE THIS ARTICLE?