ప్రాణాలు తీస్తున్న నిరుద్యోగం

నవ భారత సారథులు కావాల్సిన నేటి యువతను నిరుద్యోగ భూతం మింగేస్తుంది. పాలకుల తప్పుడు, పనికిమాలిన విధానాలే ఇందుకు ప్రధాన కారణం. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణో, లేక ప్రజాసంఘాలు చెపుతున్న వాదనో కాదు. పక్కా అధికారిక నివేదిక నిగ్గుతేల్చిన నిజమిది! నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, నిరుద్యోగ యువతతోపాటు స్వయం ఉపాధి పేరుతో ఏదో ఒక పనిచేసుకుంటున్న నవతరం సైతం పెద్దసంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2018వ సంవత్సరంలో స గటున ప్రతిరోజూ 35 మంది నిరుద్యోగులు, అలాగే స్వయం ఉపాధితో జీవిస్తున్న కనీసం 36 మంది బలవన్మరణానికి గురవుతున్నారు.
ఎన్‌సిఆర్‌బి గణాంకాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. 2018లో దేశవ్యాప్తంగా 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో రైతులు 10,349 మంది ఉన్నారు. 12,936 మంది నిరుద్యోగులు, 13,149 మంది స్వయం ఉపాధి సంస్థల బాధ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు మరణాలు ప్రభుత్వానికి సర్వసాధారణమైన విషయంగా మారిపోయిన విషయం జగమెరిగిన సత్యం. ఈసారి రైతుల కన్నా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్న యువత అదేకోవలోకి చేరడం ప్రమాదకర పరిణామం. దేశ భవిష్యత్‌కు అశుభ సంకేతం. పైగా ఏడాది కాలంలో మన దేశంలో బలవన్మరణాల సంఖ్య 3.6 శాతం పెరగడం రాబోతున్న ముప్పుకు ఇంకో సూచన. మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులేమైనా సంతోషంగా వున్నారా? అంటే అదీ లేదు. ఏడాది కాలంలో 2,022 మంది ప్రభుత్వ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మొత్తం ఆత్మహత్యల్లో ఇది 1.5 శాతం. విద్యార్థులు 7.6 శాతం, నిరుద్యోగులు 9.6 శాతం, స్వయం ఉపాధి విభాగంలో 9.8 శాతం మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు.
ఆత్మహత్యాయత్నం నేరం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆత్మహత్య మాత్రం అనివార్యం కాకూడదు. ఒక వ్యక్తికి ఆ పరిస్థితి తలెత్తితే, అది సామాజిక నేపథ్యాన్ని, వ్యక్తిగత, కుటుంబ పరిస్థితిని ఎత్తిచూపడమే కాకుండా, ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని కూడా అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది. ఇది సత్యం! కుటుంబంలో భార్యాభర్తల్లో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే కారణాలు ఏమైనా ఉండొచ్చేమోగానీ, ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడితే, అది ఆ దేశ ప్రభుత్వ విధానాన్ని సైతం నిలదీస్తుందని ప్రముఖ అంతర్జాతీయ సైకాలజిస్ట్‌ ఒకరు ఉటంకించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
2017-18 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతానికి పెరిగిందని పోయినేడాదే ఓ నివేదిక మోడీ సర్కారు యువజన వ్యతిరేక విధానాలను ఎత్తిపొడిచింది. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు చాలా కారణాలను ఆనాటి నివేదిక చూపింది. అందులో ప్రధానమైనవి యువకుడు స్థిరపడటానికి తగినంత పెట్టుబడి లేకపోవడం, ఉపాధి ప్రేరేపిత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండకపోవడం, కనీసం వ్యవసాయం చేసుకోవడానికి భూమి కొరత ఏర్పడటం, ప్రాతిపదిక సౌకర్యాలు కొరవడటం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావడం, జనాభా శీఘ్రంగా పెరిగిపోవడం వంటి కారణాలున్నాయి. ఇందులో తొలి ఆరు కారణాల వెనుక ప్రభుత్వాల ఘోర వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ముఖ్యంగా గత ఐదారేళ్లలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలు దాదాపు విద్యార్థి, యువజన, కార్మిక వ్యతిరేక కోణం నుంచి పుట్టుకొచ్చినవే. మోడీ తన పాలనాకాలంలో 85 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించినట్లు ప్రకటించుకున్నారు. అసలు ఈ దేశంలో ఉద్యోగం కోసం ఒక నెలలో 3.12 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నివేదిక ఏడాది క్రితం పేర్కొంది. ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నది మోడీ ఇచ్చిన హామీ. బిజెపి హామీలకు, ఇచ్చిన ఉద్యోగాలకు, తాజా నిరుద్యోగ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఉపాధి కల్పనకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రమే. జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు వంటి పిచ్చి నిర్ణయాల వల్ల స్వయం ఉపాధిలో ఉన్న లక్షలాది మంది యువకులు రోడ్డునపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిపోయారు. వ్యవసాయ భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే పనిలో ప్రభుత్వం బిజీ కావడంతో వలసలు ఉవ్వెత్తున పెరిగిపోయాయి. ఇవన్నీ ఆత్మహత్యాప్రేరేపిత అంశాలే. నిరుద్యోగ యువత బలవన్మరణాల నేరం నేటి సర్కారుదే. ఈ వాస్తవదృశ్యం నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోలేదని గ్రహించాలి.

DO YOU LIKE THIS ARTICLE?