ధర్మశాల వన్డేకు రంగం సిద్ధం
ధర్మశాల: ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మరో రసవత్తర క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ధర్మశాల వేదికగా గురువారం జరుగనుంది. ఇటీవల కాలంలో వరుస విజయాలతో సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే జోరును భారత్ సిరీస్‌లో కూడా కొనసాగించాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండు సిరీస్‌లలో కూడా వైట్‌వాష్‌కు గురైంది. దక్షిణాఫ్రికా మాత్రం బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించింది. ఈ గెలుపు సఫారీల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. భారత్‌తో జరిగే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధమైంది. కాగా, దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా తిరిగి విజయాల బాట పట్టాలని ఆతిథ్య భారత్ తహతహలాడుతోంది. సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం కూడా టీమిండియాకు కలిసి వచ్చే పరిణామంగా మారింది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
ధావన్ రాణించేనా?
గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈ సిరీస్ కీలకంగా తయారైంది. కొంతకాలంగా గాయాలు, పేలవమైన ఫామ్‌తో ధావన్ సతమతమవుతున్నాడు. కానీ, దక్షిణాఫ్రికా రాణించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ధావన్ బాధ్యత మరింత పెరిగింది. యువ ఓపెనర్ పృథ్వీషాతో కలిసి మెరుగైన ఆరంభం ఇవ్వాల్సిన పరిస్థితి ధావన్‌కు ఏర్పడింది. రాహుల్, షా, శుభ్‌మన్ గిల్ల రూపంలో భారత్‌కు యువ ఓపెనర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ధావన్ ఏమాత్రం విఫలమైన జట్టులో స్థానం కాపాడు కోవడం కష్టమే. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్వ వైభవం సాధించాలని తహతహలాడుతున్నాడు. ఇక, యువ ఆటగాడు పృథ్వీషాకు కూడా ఈ సిరీస్ కీలకంగా తయారైంది. న్యూజిలాండ్ సిరస్లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో షా విఫలమయ్యాడు. కనీసం ఈసారైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా షాకు ఉంది. అయితే నిలకడలేమి అతనికి ప్రతికూలంగా మారింది. ఆ లోపాన్ని సరిదిద్దకుంటే టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం ఖాయం. మరో యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా సిరీస్ కీలకమేనని చెప్పాలి. కివీస్ సిరీస్‌లో అయ్యర్ ఓ సెంచరీ సాధించినా ఫామ్ లేమితో బాధపడ్డాడు. ఈసారైనా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాల్సిన అవసరం ఎంతైన ఉంది. కొంతకాలంగా అద్భుత ఆటతో చెలరేగి పోతున్న లోకేశ్ రాహుల్ ఈ సిరీస్‌లో జట్టుకు కీలకంగా తయారయ్యాడు. అతనిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రాహుల్ విజృంభిస్తే భారత్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరి పోతాయి. ఇక, వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా రాహుల్‌కే అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నాడు.
రోహిత్ లేని లోటు…
కాగా, రోహిత్‌కు విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతలు మరింత పెరిగాయి. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన ఒత్తిడి కోహ్లిపై నెలకొంది. న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన కోహ్లి సౌతాఫ్రికా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఎటువంటి బౌలింగ్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా కోహ్లి సొంతం. ఇక, తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు.
హార్దిక్‌పైనే ఆశలన్నీ
మరోవైపు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రాకతో టీమిండియాలో కొత్త జోష్ కనిపిస్తోంది. గాయాల వల్ల చాలా కాలంగా హార్దిక్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ టి టోర్నీలో విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించాడు. సౌతాఫ్రికాపై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. హార్దిక్ చేరికతో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మరింత మెరుగ్గా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా రూపంలో టీమిండియాకు మరో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ రాణించినా భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. కాగా, భువనేశ్వర్ రాకతో బౌలింగ్ కూడా మరింత బలోపేతంగా తయారైంది. భువీతో పాటు బుమ్రా, హార్దిక్, సైనిలు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. కుల్దీప్, చాహల్‌లతో స్పిన్ విభాగం కూడా బలంగా ఉంది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా సిరీసే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది.
ఫైటింగ్ స్పిరిట్
మరోవైపు వరుస విజయాలతో పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు ఫైటింగ్ స్పిరిట్‌తో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. డుప్లెసిస్ చేరికతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. కెప్టెన్ డికాక్, జానెమన్ మలాన్, హెన్రిచ్ క్లాసెన్, స్మట్స్, డుసెన్, ఫెలుక్వాయో తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా మారింది. అంతేగాక డేవిడ్ మిల్లర్ రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. ఎంగిడి, నోర్జే, కేశవ్ మహారాజ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై వన్డేల్లో క్లీన్‌స్వీప్ సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇదే జోరును భారత్‌పై కూడా కనబరిచేందుకు దక్షిణాఫ్రికా తహతహలాడుతోంది.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్‌పంత్, నవ్‌దీప్ సైని, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్.
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (కెప్టెన్), టెంబా బవుమా, ఫా డుప్లెసిస్, జెజె స్మట్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, జానెమన్ మలాన్, కిల్ వెర్రినె, అన్రిచ్ నోర్జే, లుథో సిపామ్లా, జార్జ్ లిండే, వండర్ డుసెన్, బ్యూరాన్ హెండ్రిక్స్.
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం&