దివ్యాంగుల‌ను ఆదుకోండి!

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న దివ్యాంగులు లాక్‌డౌన్‌ కారణంగా పడుతున్న
ఇబ్బందుల దృష్ట్యా రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే యోచనలో
ప్రభుత్వం ఉందో లేదో చెప్పాలని హైకోర్టు కోరింది. రాష్ట్రంలో ఏడున్నర
లక్షల మందికిపైగా దివ్యాంగులు ఉన్నారని, వీరంతా కరోనా వల్ల కష్టాలు
పడుతున్నారని, ఎన్నో వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్న
ప్రభుత్వం వీరి విషయంలోనూ సానుకూలంగా వ్యవహరించాలని కోరింది. లాక్‌డౌన్‌
వల్ల సమస్యలు ఎదుర్కొనే దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ
కె.శివగణేష్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌
విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ మరోసారి విచారణ చేసింది. దివ్యాంగుల
సంక్షేమం కోసం రూ.10 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు కోసం వికలాంగ సంక్షేమ
శాఖ ఉన్నతాధికారి శైలజ ప్రభుత్వానికి కోరారని, ఇంకా ప్రభుత్వం నుంచి
నిర్ణయం వెలువడాల్సివుందని ఏజీæ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రంలో
పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఉంటే ప్రభుత్వం మాత్రం రంగారెడ్డి, మేడ్చల్‌
జిల్లాలకు రూ.5 లక్షలు చొప్పున ఇతర జిల్లాలకు ఒక్క లక్ష చొప్పున నిధులు
విడుదల చేసిందని పిటిషనర్‌ లాయర్‌ పవన్‌కుమార్‌ చెప్పారు. దీనిపై
స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి రూ.10 కోట్లతో
ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేదీ లేనిదీ 24న జరిగే విచారణ సమయంలో చెప్పాలని
ఆదేశించింది.

DO YOU LIKE THIS ARTICLE?