లోక‌ల్ పేప‌ర్ల‌లో హెల్త్ బులిటెన్లు ప్ర‌క‌టించాలి

తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు దిశానిర్దేశం

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌ : కోవిడ్‌ 19 వైరస్‌ వ్యాప్తి నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర
సర్కార్‌కు హైకోర్టు మరోసారి ఉత్తర్వులిచ్చింది. నిత్యం హెల్త్‌
బులిటెన్‌ విడుదల చేయడంతోపాటు ఆ వివరాలను లోకల్‌పేపర్లల్లో కూడా
ప్రకటించాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 16 నుంచి పది
రోజులపాటు రోజుకు 5 వేల చొప్పున జరపతలపెట్టిన 50 వేల పరీక్షల లక్ష్యాన్ని
సాధించాలి. పరీక్షలు ఎక్కువ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మొబైల్‌
టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం ఆచరణ దిశగా ఆలోచన
చేయాలి. కరోనా కోరలు చాచుతున్న నేపథ్యంలో మొబైల్‌ సేవలు చాలా అదవసరమని
గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ అమలు చేయాలి.
యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్స్‌ వినియోగంలోకి తేవాలి. జిల్లాల్లో కరోనా
వైద్యం అందించే 53 ఆస్పత్రుల గురించి బాగా ప్రచారం చేయాలి. కరోనా వైద్య
సేవలు గాంధీకే పరిమితం కాదని తెలియజేయాలి. వైద్యులకు, వైద్య సిబ్బందికి
పోలీస్‌ రక్షణ ఉండాలి. గాంధీ తరహాలోనే జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సేవలు
అందించే మొత్తం స్టాఫ్‌లో సగం మందికే సేవలు వినియోగించేలా షిఫ్ట్‌లు
వేయాలి. ఆస్పత్రి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి… అని హైకోర్టు
చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌
బెంచ్‌ గురువారం రాష్ట్రాన్ని ఆదేశించింది.
కరోనా వైద్యం చేసే వారికి వైద్య రక్షణ పరికాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన
సుమారు పది పిల్స్‌ను గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ‘జిల్లాల్లో
కరోనా వైద్యం అందించేందుకు 54 ఆస్పత్రులను గుర్తించాం. కరోనా కట్టడికి
అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మొబైల్‌ ల్యాబ్స్‌ ఆచరణ సాధ్యం కాదు. పీపీఈ
కిట్లు కావాల్సినన్ని ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో పది రోజుల్లో 50 వేల
పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.జిల్లాల్లో 54 కరోనా
ఆస్పత్రుల్లో 2430 ఐసోలేషన్‌ బెడ్స్, 349 ఐసీయూ బెడ్స్‌తో జిల్లాల్లో
కరోనా ఆస్పత్రులను ప్రభుత్వం గుర్తించింది.. 46 మేజర్‌
ప్రభుత్వాసుపత్రుల్లో ఈ నెల 16 నాటికి పీపీఈ కిట్ల నిల్వలు ఉన్నాయి.. అని
ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 274
మంది పోలీసులు నిరంతరం రక్షణగా ఉన్నారని తెలిపారు. గాంధీలో 441 మంది
కరోనా బాధితులు ఉన్నారని, వైద్యం చేసే డాక్టర్లకు వారి కుటుంబ సంక్షేమ
కోణంలో వారికి వేరే చోట వసతి కల్పించామన్నారు. దీనిపై హైకోర్టు
స్పందిస్తూ గాంధీలో అశుభ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయని, దీని విషయంలో
చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కరోనా పరీక్షలను 18 ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌
అనుమతి ఇచ్చిందన్నారు. ల్యాబ్‌లో పరీక్ష చేస్తే రూ.2200, ఇంటికి వచ్చి
చేస్తే రూ.2800 చొప్పున వసూలుకు ధర నిర్ణయం జరిగిందన్నారు. కరోనా వైద్య
సేవల్లో నిమ్స్‌ను ఎందుకు చేర్చలేదని హైకోర్టు ప్రశ్నకు ఏజీ బదులిస్తూ,
నిమ్స్‌ అటానమ్స్‌ సంస్థ అని, కరోనా మినహా ఇతర జబ్బులకు నిమ్స్‌లో వైద్యం
జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో 79 మంది డాక్టర్లకు కరోనా పోజిటివ్‌ ఉన్నట్లు తేలిందని
పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో ఏడు
లక్షల కిట్లు ఉంటే వాటిలో కరోనా వైద్య సేవ చేస్తున్న వారందరికీ పంపిణీ
జరిగిందన్నారు గాంధీ ఆస్పత్రిలో యాంజీ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నామని,
ప్లాస్మా కూడా చేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు
చెప్పారు. విచారణ సందర్భంగా హైకోర్టు.. ఈ నెల 16,17 తేదీల్లో 1251, 1096
చొప్పున మాత్రమే రాష్ట్రంలో పరీక్షలు జరిగాయని, రోజుకు 5 వేలు చేయాలన్న
లక్ష్యం దిశగా చర్యలు లేవని గుర్తు చేసింది. తిరిగి ఏజీ వాదిస్తూ, 90
శాతం పరీక్షలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయన్నారు. 25 వేలకుపైగా
శానిటైజర్లు, 1.47 గ్లౌజులు, 3 లక్షల సర్జికల్‌ గ్లౌజులు, 4.60 లక్షల
మూడు పొరల మాస్క్‌లు, ఎన్‌95 మాస్క్‌లు కూడా చాలా నిల్వలున్నాయని, ఇవన్నీ
హైదరాబాద్‌కే కాకుండా జిల్లాల్లోని కరోనా ఆస్పత్రులకు
వినియోగిస్తామన్నారు. కరోనాను అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం
సర్వశక్తులను ఒడ్డుతోందని చెప్పారు. వాదనల అనంతరం ప్రభుత్వ నివేదిక 29కి
అందజేయాలని, విచారణను 30 జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.

DO YOU LIKE THIS ARTICLE?