మెట్రో టిక్కెట్లు నిబంధనలకు వ్యతిరేకం?
మీడియాఫైల్స్/హైదరాబాద్ : మెట్రో రైలు టిక్కెట్ల ధరలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాయితీ ఒప్పంద నిబంధనలకు
వ్యతిరేకంగా మెట్రో రైలు టిక్కెట్ల ధరల్ని నిర్ణయించడం చెల్లదని
పేర్కొంటూ సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి
ఎం.శ్రీనివాస్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని
బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్,
న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం
విచారించింది. ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు హైదరాబాద్
మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ, ఎల్ అండ్ టీలకు నోటీసులు జారీ చేసింది.
తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి
విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మెట్రో రైలు ప్రయాణానికి కనీస ధర రూ.8, గరిష్ట ధర రూ.19గా (రోజులో
అపరిమితంగా ప్రయాణానికి రూ.40 నిర్ణయించారు) ఉండాలని 2010లో రాష్ట్ర
ప్రభుత్వంతో ఎల్అండ్టీ ఒప్పందం చేసుకుంది. నష్టాలు వస్తే రేట్లు
పెంచకూడదనే కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్లు ఇచ్చింది. వ్యాపారాలు
చేసుకునేందుకు మాల్స్ నిర్మాణాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 280
ఎకరాల భూమి ఇవ్వడంతోపాటు ఆర్థికం కూడా తన వంతు చెల్లింపులు చేసింది,
రైల్వే సర్వీసులు ప్రారంభం అయ్యాక ఏటా గరిష్టంగా 5 శాతం పెంచుకునేందుకు
వీలుగా ఆ ఒప్పందం కుదిరింది. అయితే, 2017 నవంబర్ 27న మెట్రో రైలును
ఒప్పందాన్ని ఉల్లంఘించి టికెట్ ధరలను నిర్ణయించారు. కనీస ధర రూ.10,
గరిష్ట ధర రూ.60గా నిర్ణయించేసి ప్రయాణీకుల నుంచి పెద్ద మొత్తంలో
ఒప్పందానికి వ్యతిరేకంగా వసూళ్లకు పాల్పడటం అన్యాయం. ఒప్పందం ప్రకారం
టికెట్ ధరలు ఉండాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం
లేకపోయింది. రోజుకు నాలుగు లక్షల మంది మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటారు.
వీరందరి నుంచి అధిక మొత్తం టికెట్ ధరలను వసూలు చేస్తున్నారు. రాయితీ
ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల్ని నిర్ణయించడం చెల్లదని
ప్రకటించాలి. టికెట్ ధరల్ని 2017 నవంబర్ 25న నిర్ణయించిన వాటిని రద్దు
చేయాలి. 2010లో జరిగిన ఒప్పందం ప్రకారం టికెట్ ధరలు ఉండేలా ఉత్తర్వులు
ఇవ్వాలి.. అని పిల్లో హైకోర్టును కోరారు.