రైతుల నుంచి దౌర్జన్యంగా సంతకాలా?
అనంతగిరిసాగర్ రిజర్వాయర్ భూసేకరణ రాజ్యాంగ వ్యతిరేకం : హైకోర్టు
మీడియాఫైల్స్/హైదరాబాద్ : అనంతగిరిసాగర్ రిజర్వాయర్ నిమిత్తం రెండు గ్రామాల్లో 120 మంది నుంచి
భూమి సేకరించిన తీరు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తీర్పు
చెప్పింది. రైతులు స్వయంగా అంగీకారం తెలిపినట్లుగా ఒప్పంద పేపర్లపై
అధికారులు దౌర్జన్యంగా సంతకాలు చేయించారని, ఇవి చెల్లవని తెలిపింది.
ఇప్పటికే వారికిచ్చిన పరిహారాన్ని వదిలి తిరిగి ఆనాటి భూముల విలువలను
బేరీజు వేసి పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూ బుధవారం
న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచందర్రావు, జస్టిస్ కె.లక్ష్మణ్ల
డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
ఎకరానికి రూ.6 లక్షలు నిర్ణయించి పిటిషనర్లతో ఒప్పంద పేపర్లతో సంతకాలు
చేయించిన అధికారులు అందుకు కారణాలు, ఎందుకు వారు ఒప్పుకున్నారో వంటి
వివరాలు అధికారులు కోర్టుకు ఇవ్వలేదు. ఆ ధర నిర్ణయాన్ని డిస్టిక్ట్
లెవెల్ భూసేకరణకమిటీ ఆమోదించిన తీర్మానం గానీ అక్కడి మార్కెట్ ధర
వివరాలు గానీ ఇవ్వలేదు. రైతులు తమకు తాముగా ఆర్ఆర్ ప్యాకేజీలు వద్దని
ఒప్పందంపై సంతకాలు చేసినట్లుగా ఉన్నవాటికి ప్రభుత్వం వేసిన కౌంటర్లో
కారణాలు చెప్పలేదు. పిటిషనర్ల గ్రామాలకు సమీపంలోనే ఉన్న లింగారెడ్డిపల్లి
గ్రామంలో ఎకరా ధర 13 లక్షలుగా ప్రభుత్వమే చెల్లించి పిటిషనర్లకు
రూ.6లక్షలనే ఎలా నిర్ణయించిందో కూడా వివరించలేదు. 120 మంది పిటిషనర్ల
నుంచి తీసుకున్న భూమికి భూసేకరణ చట్టం కింద పరిహారం నిర్ణయించి
చెల్లించాలి. పిటిషనర్ల విషయంలో ప్రభుత్వాధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా
వ్యవహరించారు. పిటిషనర్లతో బలవంతంగా అధికారులు చేసుకున్న ఒప్పందం
చెల్లదు. వారందరికీ ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి.. మూడు నెలల్లోగా
అమలు చేయాలి. ఈకేసు చీఫ్ జస్టిస్ దగ్గర ఉన్నప్పుడు రిజ ర్వాయర్కు
నీటిని విడుదల చేయాలని అత్యవసరంగా రిట్లను విచారించాలని ఏజీ కోరారు. తీరా
చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఈ కేసు తమ దగ్గరకు రాగానే విచారణ
అత్యవసరం కాదని ఏజీ చెప్పడం, లాక్డౌన్ ఎత్తేసే వరకూ వాయిదా వేయాలని
కోరడం సముచితంగా లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు రాలేనని
పేర్కొనడం సమర్ధనీయంగా లేదు. లాక్డౌన్ తర్వాత సుప్రీంకోర్టు సహా అన్ని
హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్లో కేసుల్ని విచారిస్తున్నాయి. ఏజీ కూడా
ప్రభుత్వ లాయర్లను పక్కనపెట్టుకుని ఇతర కోర్టుల్లో కేసుల్ని వాదించారు. ఈ
కేసులో మాత్రం భౌతిక దూరం పేరుతో వాయిదా వేయాలని కోరడం చెల్లదు. వాయిదా
వేస్తూ పోతే భూమి పోయిన రైతుల పరిస్థితి ఏం కావాలనే కోరణంలోనే కాకుండా
భూమి కేసుల్ని ఆరు నెలల్లో తీర్పు చెప్పాలన్న నిబంధనల మేరకు తీర్పు
చెబుతున్నాం.. అని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.