కాలుష్య కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌పై ఉక్కుపాదం

తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టు ఆదేశం

మీడియాఫైల్స్/హైదరాబాద్‌ : కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా అనధికారికంగా
పెట్టిన పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతుంటే అధికారులు చూస్తూ
ఉండకూడదని పేర్కొంది. రసాయిన, ఫార్మా రంగాలకు చెందిన పరిశ్రమల నుంచి
కాలుష్యం వెలువడి ప్రజలకు అనారోగ్యం వస్తుంటే చర్యలు తీసుకోవాల్సిందేనని,
అదేమాదిరిగా అనధికార పరిశ్రమలపై కూడా చర్యలు తీసుకోవాలని తేల్చి
చెప్పింది. ఈమేరకు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌
విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్,
రంగారెడ్డి జిల్లాల్లోని అనధికార పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో వాటిని
తొలగింపు చర్యలు చెప్పాలని కోరింది. నగరంలోని పలు పారిశ్రామికవాడల్లోనూ,
ఆరెండు జిల్లాల్లోని పరిశ్రమల నుంచి కాలుష్య ప్రమాదకరస్థాయిలో ఉంటే
కచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాలుష్యం వల్ల ఆయా
ప్రాంతాల్లోని జనం కంటి సమస్యతోపాటు చర్మరోగాలు, ఊపిరితిత్తులు,
శ్వాసపరమైన రోగాలతో సతమతం అవుతున్నారని ఈ నెల 8న పత్రికల్లో విచ్చిన
స్టోరీ ప్రతిని జత చేస్తూ లాయర్‌ రవీందర్‌ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని
పిల్‌గా తీసుకున్న హైకోర్టు ప్రతివాదులైన రాష్ట్ర మున్సిపల్‌ శాఖల ముఖ్య
కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు
సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల
కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ వేయాలని వారిని ఆదేశించిన
హైకోర్టు విచారణ జూన్‌ 8కి వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?