నలుగురు కార్మికుల ప్రాణాలు బొగ్గు పాలు
మీడియాఫైల్స్/గోదావరిఖని : సింగరేణి బొగ్గు గనుల్లో మంగళవారంనాడు భారీ పేలుడు సంభవించింది. నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా ఆర్జి 3 పరిధిలో ఉన్న ఓపెన్‌కాస్ట్ -1లోని 78 ఆర్ఎల్ (సముద్ర నీటిమట్టం) ఫేస్-2 అప్లోడింగ్ పని స్థలంలోని మహాలక్ష్మీ ప్రైవేటు కంపెనీకి చెందిన కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు బండి ప్రవీణ్, బిల్లా రాజేశం, అర్జయ్య, రాకేష్‌లు అక్కడికక్కడే మరణించారు. కమాన్‌పూర్‌కు చెందిన వెంకటేష్‌కు రెండు కళ్లు పోయి పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులైన మరో ముగ్గురిలో రత్నాపూర్‌కు గ్రామానికి చెందిన భీమయ్యకు రెండు కాళ్లు విరుగగా, సూపర్ వైజింగ్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన రామగుండం సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులు ఉదయం 10గంటలకు బోల్డర్కు వేసిన డ్రిల్ రంద్రంలో డిటోనేటర్, ఎక్స్‌ప్లోజివ్స్‌ను పైపుతో నింపుతుంటే భూమిలో నుండి వేడి వచ్చి బ్లాస్టింగ్ సంభవించింది. వెంటనే సింగరేణి అధికారులు, మహాలక్ష్మీ కంపెనీ అధికారులు కార్మికుల మృతదేహాలను, గాయపడిన కార్మికులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.