ఎంపీగా మాజీ సిజెఐ రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) రంజన్ గొగోయ్‌ను ప్రభుత్వం సోమవారం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయన అయోధ్య భూవివాదం, రాఫెల్ యుద్ధ విమాన ఒప్పందం, శబరిమలలో మహిళల ప్రవేశం కేసులు సహా అనేక కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. రాజ్యసభకు ఆయన నామినేషన్‌కు సంబంధించిన ప్రకటనను హోం మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రే ప్రకటించింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 80కి చెందిన క్లాజ్ 1లోని సబ్‌క్లాజ్ ఎ కింద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన పేరును రాజ్యసభకు నామినేట్ చేశారు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెటిఎస్ తుల్సీ రిటైర్ కావడంతో ఖాళీ అయిన స్థానానికి గొగోయ్ పేరును ప్రభుత్వం నామినేట్ చేసింది. రాజ్యసభకు తొలిసారి నామినేట్ అయిన మాజీ సిజెఐ ఆయనే. ఇదివరలో మాజీ సిజెఐ రంఘనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. అయితే ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. ఎన్ఆర్సిని పర్యవేక్షించిన ధర్మాసనానికి కూడా గొగోయ్ నేతృత్వం వహించారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా తన బ్లాగ్‌లో వ్యాఖ్యలు చేసిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూపై విచారణ జరిపిన ధర్మాసనానికి కూడా రంజన్ గొగోయ్ నేతృత్వం వహించారు.