ఆహార భద్రత లేనట్లేనా?

తిండి లేక అలమటిస్తున్న జనం రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచంలో 79.5 కోట్ల మంది ప్రజలకు సరైన ఆహారం అందడం లేదు. 12.9 శాతం మంది ప్రజలకు అసలు పౌష్టికాహారమే దొరకడం లేదు. క్షామపీడిత దేశాల సంఖ్య పెరుగుతోంది. ఎఫ్‌ఎఓ అంచనాల ప్రకారం అచ్చంగా 35 దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. తిందామంటే తిండి లేకపోవడం ఆహార అభద్రత. అదొక కోణం మాత్రమే. కానీ ఇష్టానుసారంగా ఆహారం అందుబాటులో ఉన్నా అది సురక్షితంగా లేకపోవడం మరొక కోణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తన తాజా నివేదికలో ఇదే విషయాన్ని నొక్కివక్కాణించింది. ఫుడ్‌ సెక్యూరిటీకి, ఫుడ్‌ సేఫ్టీకి మధ్య తేడాను విడమరిచి చెప్పింది. సురక్షితమైన ఆహారం అందివ్వడం, తినడం ప్రతి ఒక్కరి పనిగా హూ అభివర్ణించింది. ప్రజలు సురక్షితమైన ఆహారం తినకపోవడం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది రోగాల పాలవుతున్నారు. కేవలం ఆహారం నుంచి జనించిన సూక్ష్మక్రిముల పుణ్యమా అని వీరంతా వ్యాధిగ్రస్తులవుతున్నారని డబ్ల్యుహెచ్‌ఓ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కల్తీ ఆహారం తినడం వల్ల ప్రతి పదిమందిలో ఒకరు మంచాన పడుతున్నారు. అంటే సురక్షిత రహితమైన ఆహారం మానవాళిని ఏ విధంగా దెబ్బతీస్తున్నదో అర్థమవుతోంది.
భవిష్యత్‌లో రుచికరమైన ఆహారం దొరుకుతుందేమో గానీ సురక్షితమైన ఆహారం దొరక్కపోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన. ఐదేళ్ల లోపు బాలలు ఎక్కువగా అసురక్షిత ఆహారానికి బలవుతున్నారు. సురక్షితంకాని ఆహారం మూలంగా 40 శాతం మంది పిల్లలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. అలా యేటా 1,25,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతియేటా వరల్డ్‌ ఫుడ్‌ సేఫ్టీ డేను జూన్‌ 7వ తేదీన నిర్వహించి, సురక్షితమైన ఆహారం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తొలిసారిగా పిలుపునిచ్చింది. ఆహార సురక్షిత దినం పాటించే బాధ్యతను ఐరాసకు చెందిన ఎఫ్‌ఎఓ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌)కు అప్పగించింది. అంటే ఈ సంవత్సరం ఆహార సురక్షిత దినోత్సవాన్ని మరికొన్ని గంటల్లో జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్‌ఓ గట్టిగా చెపుతున్నట్లుగా సురక్షితమైన ఆహారం కొరవడుతున్న విషయం ఆందోళన కలిగించేదే.
మంచి ఆరోగ్య వ్యవస్థ నెలకొనడానికి సురక్షితమైన, పోషకాహారం తగినంత అందివ్వడం అత్యంత అవశ్యం. ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడం, ఆహార కారక వ్యాధులు ప్రబలడం వల్ల అది పరోక్షంగా సామాజిక, ఆర్థిక పురోభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలు, పర్యాటక, వాణిజ్య రంగాలను కూడా దెబ్బతీస్తుంది. మనిషి శక్తికి, ఆరోగ్యానికి, సంపద్వంతమైన నిలకడతనానికి ఆహారం అనేది ప్రథమ ప్రాధాన్యతాంశం. ఆహార భద్రత కొరవడిన దేశాలన్నీ పేద దేశాలే. కానీ సురక్షితమైన ఆహారం అమెరికా వంటి అగ్రదేశాల్లో సైతం ఒక్కోసారి దొరకడం లేదంటే ఆశ్చర్యకరంగా వున్నప్పటికీ, ఇది ముమ్మాటికీ నిజం. 90 శాతం జంక్‌ఫుడ్‌కు ప్రాధాన్యతనిచ్చే సంపన్న దేశాల ప్రజలు ఆహార ఆధారిత వ్యాధులకు గురవుతున్నారు. అప్పటికప్పుడు తయారుగా ఉన్న ఆహారంపై ఆన్‌లైన్‌ వ్యాపారం విశృంఖలంగా పెరిగిన తర్వాత సహజంగానే ఈ తరహా వ్యాధులు పెచ్చుమీరాయని ఒక నివేదిక వెల్లడించింది. నోరోవైరస్‌, సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్‌, కాంపైలోబ్యాక్టర్‌, స్టెఫైలోకోకస్‌ ఆరస్‌ వంటి వ్యాధులకు వారు గురవుతున్నారు. ఇవన్నీ వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయి. యేటా అమెరికాలో కనీసం కోటిమందిని వేధించే వ్యాధుల్లో ఈ ఐదు రోగాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అంటే అమెరికాలో తినడానికి మస్తుగా ఉన్నా, వారు సురక్షితమైన ఆహారం తినలేకపోతున్నారన్నది సుస్పష్టం. ఇటీవలనే ప్రపంచాన్ని వణికించి ఈకోలీ వ్యాధి ఈ కోవకు చెందినదే. పాలు, పళ్ల రసాలతో కూడిన ఇంజినీరింగ్‌ ఫుడ్‌ కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది.
ఆహార ఆధారిత వ్యాధులను తగ్గించుకునే కొద్దీ సురక్షితమైన ఆహారాన్ని అధికంగా పొందుతున్నట్లే భావించవచ్చు. అలా జరగాలంటే, మంచి వ్యవసాయ పద్ధతులను ఆచరించడం, వీలైనంతవరకు సేంద్రియ వ్యవసాయానికే ప్రాధాన్యతనివ్వడం, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, ప్రాదేశిక, జల, పశుసంవర్ధక, ఉద్యానవనాలకు ప్రాధాన్యతనివ్వడం వంటి ఆచరణాత్మక విధానాలను అనుసరించాలి. అలాగే, ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఆహారాన్ని ఇంటికే పంపించే ఆహార వ్యాపార సంస్థలు కచ్చితంగా ప్రామాణికమైన ఆహార సురక్షిత నిర్వహణ వ్యవస్థలను అనుసరించాలి. ఆహార సరఫరా ప్రామాణిక పద్ధతుల విషయంలో ప్రభుత్వాలు నిఘాతో వ్యవహరించాలి. ప్రభుత్వాలతోపాటు శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అన్నిటికన్నా ముఖ్యంగా పౌర సమాజం బాధ్యతతో వ్యవహరించినప్పుడే, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందుతుంది. లేనిపక్షంలో మనిషిని బతికించే ఆహారమే మనిషిని చంపేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

DO YOU LIKE THIS ARTICLE?