ఉగ్రవాదానికి ఆర్థికసాయం

పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులకు ఆర్థికసాయం అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టెర్రర్‌ దాడులు జరిగిన ప్రతిసారీ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం గురించి ప్రస్తావించుకోవడం, ఆందోళన చెందడం, తీర్మానాలు చేయడం పరిపాటిగా మారింది. 40 మందిని పొట్టనపెట్టుకున్న జైషే మహ్మద్‌ ఉగ్రదాడి తర్వాత ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఎటిఎఫ్‌) వంటి సంస్థలతోపాటు అమెరికా వంటి దేశాలు సైతం ‘టెర్రర్‌ ఫైనాన్సింగ్‌’పై ఆవేదన చెందాయి. కానీ కార్యాచరణ మాత్రం అంతంతమాత్రమే. దీంతో పాకిస్థాన్‌ వంటి దేశాలు ఎలాంటి భయం లేకుండా నిరంతరాయంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తూ వాటిని విశృంఖలంగా పెంచిపోషిస్తున్నాయి.
అంతర్జాతీయ ఉగ్రవాద ఆర్థిక సహకారంపై నిఘా సంస్థగా వ్యవహరిస్తున్న ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఎటిఎఫ్‌) పులామా ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది. అంతవరకు బాగానే వుంది. జైషే మహ్మద్‌, లష్కరే తొయిబా, జమాత్‌ ఉద్‌ దవా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధుల వెల్లువను ఆపడంలో ఘోరంగా విఫలమైన పాకిస్థాన్‌ను ‘గ్రే లిస్ట్‌’లోనే కొనసాగించాలని కూడా నిర్ణయించింది. టెర్రర్‌ గ్రూపులకు విపరీతంగా నిధులు అందుతున్నాయని, ఉగ్రవాద కార్యకలాపాలకు అదే ప్రధాన ప్రాతిపదికగా మారుతున్నదని, దీనిపై తగినంత పర్యవేక్షణ వుండకపోతే భవిష్యత్‌ మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో పాకిస్థాన్‌ తన వ్యూహాత్మక లోటుపాట్లను సరిచేసుకునేలా ఒక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ, పాక్‌ పూర్తిగా విఫలమైందని ఆవేదన వెలిబుచ్చింది. ఉగ్రవాదాన్ని అత్యంత ప్రమాదకరమైన, సున్నితమైన అంశంగా పాక్‌ అసలు పరిగణించడం లేదని పేర్కొంది. పాకిస్థాన్‌ తన టిఎఫ్‌ (టెర్రర్‌ ఫైనాన్సింగ్‌) రిస్క్‌ అసెస్‌మెంట్‌ విధానాన్ని సవరించాలని, దాయేష్‌ (ఐసిస్‌), అల్‌ఖైదా, జెయుడి (జమాద్‌ ఉద్‌ దవా), ఎఫ్‌ఐఎఫ్‌ (ఫలా ఎ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌), హెచ్‌క్యూన్‌ (హకానీ నెట్‌వర్క్‌), తాలిబాన్‌ అనుబంధ సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకోవడంలో పాకిస్థాన్‌ విఫలమైందని కూడా ఎఫ్‌ఎటిఎఫ్‌ పేర్కొంది. 2019 జనవరి నాటికల్లా పాకిస్థాన్‌ తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని గడువు విధించిన ఆ సంస్థ తాజాగా ఆ గడువును ఇదే సంవత్సరం మే నెల వరకు పొడిగించడంలో అంతరార్థం కన్పించడంలేదు. జూన్‌ తర్వాతనే పాకిస్థాన్‌ ‘గ్రే లిస్ట్‌’ జాబితాపై సమీక్షిస్తామని స్పష్టంచేసినప్పటికీ, అదంతా తూ.తూ. మంత్రంగా నడిచిపోయే తంతు అని అర్థమైపోతున్నది. కాకపోతే, పాక్‌ను గ్రేలిస్ట్‌లో వుంచడం వల్ల ఉగ్రవాదులకు తోడ్పాటునందిస్తున్న దేశంగానే ఆ దేశంపై ముద్ర కొనసాగుతుంది.
పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్‌ఎటిఎఫ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, మనీల్యాండరింగ్‌ వ్యవహారాలపై నిఘా కోసం 1989లో స్థాపించారు. ఎఫ్‌ఎటిఎఫ్‌లో 37 సభ్య దేశాలతోపాటు యూరోపియన్‌ కమిషన్‌, గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ వంటి ప్రాంతీయ సంస్థలు సభ్యత్వం కలిగివున్నాయి. దీని నిర్ణాయక విభాగం ఎఫ్‌ఎటిఎఫ్‌ ప్లీనరీ ఏటా మూడుసార్లు సమావేశమవుతుంది. సభ్యదేశాల మంత్రులు పాల్గొంటూ వుంటారు. 1996, 2001, 2003, 2012లలో కీలక ప్రకటనలు చేయడం ద్వారా అందరి ప్రశంసలు పొందింది. కానీ ఏ ఒక్క ఉగ్రవాద సంస్థకూ ఆర్థికసాయాలు ఆగలేదు. పైగా మనీ ల్యాండరింగ్‌ వ్యవహారాలు కొత్తపుంతలు తొక్కాయి. ఆర్థిక లావాదేవీలు డిజటలీకరణలోకి రూపాంతరం చెందాక బిట్‌కాయిన్‌ వంటి డిజటల్‌ మనీ స్వరూపాలు ఉగ్రవాదాన్ని మరింత పెంచిపోషించాయి. పైగా జషే మహ్మద్‌, లష్కరే తొయిబా, ఐసిస్‌, తాలిబాన్‌, అల్‌ఖైదా వంటి సంస్థలు ఏకంగా ప్రభుత్వాలనే శాసించే స్థాయికి చేరాయి. ఎఫ్‌ఎటిఎఫ్‌కు 30 ఏళ్లు నిండుతున్నా, డిజిటల్‌ మనీ రూపాల్లో ఉగ్రవాదానికి అందుతున్న సొమ్ములను అదుపు చేయడంలో విఫలమైంది. మూడు రోజుల క్రితం సమావేశమైన ఈ సంస్థ ఇరాన్‌, ఉత్తర కొరియాలపై ఆందోళన వ్యక్తం చేసినంతగా పుల్వామాపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అమెరికా వంటి దేశాలకు జేబు సంస్థగా మారుతోందన్న ఆరోపణలకు ఆ సంస్థ వ్యవహార శైలి అద్దంపడుతోంది. మనీల్యాండరింగ్‌, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాలను అదుపు చేయడానికి కొన్ని దేశాలు తమ స్వంత నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. 9/11 టెర్రర్‌ దాడి తర్వాత అమెరికా యుఎస్‌ పేట్రియాట్‌ యాక్ట్‌ను తీసుకువచ్చింది. అలాగే ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టు ఫైనాన్స్‌ ట్రాకింగ్‌ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తెచ్చింది. జర్మనీ, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాలు కూడా ఇదేబాటలో ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ, హవాలా ద్వారా సాగే ఆర్థిక లావాదేవీలు ఏ స్థాయిలో ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తున్నాయో నేటికీ ఒక కార్యాచరణలోకి రాలేకపోయాయి. హమాస్‌ సైనిక విభాగం అల్‌ఖసమ్‌ బ్రిగేడ్స్‌ పోయిన జనవరిలో ఏకంగా బిట్‌కాయిన్‌ సాయం కోసం బహిరంగంగానే పిలుపునిచ్చింది.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామంటూ పదేపదే చెపుతూ దాన్ని పెంచిపోషించే ఆర్థిక మూలాల నిర్మూలనలో మాత్రం ప్రపంచ సంస్థలు నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం ఉగ్రవాద అంతంలో వెనుకడుగు వేయడమే. ఉగ్రవాద ఆర్థిక పోషకులపై కొరడా ఝుళిపించనంత కాలం ఈ ముప్పు ఇలాగే వుంటుందనేది విస్పష్టం.

DO YOU LIKE THIS ARTICLE?