ఢిల్లీ క్యాపిటల్స్‌ జయభేరి

షార్జా : ఐపిఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డిసి) జోరు కొనసాగుతోంది. శుక్రవారంనాడు జరిగిన కీలకమైన లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 46 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇంకా రెండు బంతులు మిగిలివుండగానే 138 పరుగులకే కుప్పకూలింది. కగిసో రబడ, స్టాయినిస్‌, అశ్విన్‌లు అద్భుతమైన బౌలింగ్‌ చేసి ఆర్‌ఆర్‌ను మట్టికరిపించారు. అంతకుముందు, ఢిల్లీ క్యాపిటల్స్‌ 185 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. హెట్‌మెయిర్‌(45; 24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), మార్కస్‌ స్టోయినిస్‌(39; 30బంతుల్లో 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(22;18 బంతుల్లో 4 సిక్స్‌లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌ ఆరంభించారు. అయితే జోఫ్రా ఆర్చర్‌ వేసిన రెండో ఓవర్‌లో ధావన్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా, పృథ్వీషా(19) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఆర్చర్‌ వేసిన ఐదో ఓవర్‌లో పృథ్వీ షా ఔటయ్యాడు. కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(22; 18 బంతుల్లో 4 ఫోర్లు) ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రిషభ్‌ పంత్‌(5) రనౌట్‌గా ఔటయ్యాడు. అనవసరపు పరుగు కోసం క్రీజ్‌ దాటి ముందుకు రావడంతో రాహుల్‌ తెవాటియా విసిరిన అద్భుతమైన త్రోకు పంత్‌ ఔటయ్యాడు. ఆ తరుణంలో హెట్‌మెయిర్‌-స్టోయినిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ముందు స్టోయినిస్‌ సిక్స్‌లతో విరుచుకుపడితే, ఆపై హెట్‌మెయిర్‌ ఎదురుదాడికి దిగాడు. స్టోయినిస్‌ ఔటైన తర్వాత హెట్‌మెయిర్‌ బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. చివర్లో హర్షల్‌ పటేల్‌(16 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌(17) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు సాధించగా, కార్తీక్‌ త్యాగి, ఆండ్రూ టై, రాహుల్‌ తెవాటియా తలో వికెట్‌ సాధించారు.

DO YOU LIKE THIS ARTICLE?