ఎన్‌పిఆర్‌ వద్దంటూ 1000 సంతకాలతో సిఎంలకు లేఖలు

న్యూఢిల్లీ : జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌)తో మహిళా లోకానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు ప్రధాన కార్యదర్శి అనీ రాజా హెచ్చరించారు. జనాభా ఇంటింటి జాబితా నమోదుతో ఎన్‌పిఆర్‌ను జోడించవద్దని ఆమె డిమాండ్‌ చేశారు. 2021 జనగణన కోసం జరిపే ఇంటింటి జనాభా నమోదు ప్రక్రియతోపాటు 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పిఆర్‌ అప్‌డేషన్‌ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైన నేపథ్యంలో పలువురు మహిళా హక్కుల నేతలు మంగళవారంనాడు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. 1000 మంది సంతకాలతో కూడిన ఈ లేఖను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించినట్లు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. ఎన్‌పిఆర్‌ను, జనగణనతో లింకుచేయవద్దని కోరుతూ, అసలు ఈ ప్రక్రియ యావత్తూ మహిళల మనుగడకే ముప్పు అని పేర్కొంటూ ఈ లేఖను ముఖ్యమంత్రులకు పంపించినట్లు తెలిపారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో మహిళా కార్యకర్తలు, రచయితలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, రైతులు, వృత్తినిపుణులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, 20 రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు వున్నారు. జనాభాలో 50 శాతం మంది ఉన్న మహిళలకు ఎన్‌పిఆర్‌ చాలా ప్రమాకరమైనదని, దీన్ని సిఎంలంతా వ్యతిరేకించాలని ఆ లేఖలో కోరారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ లేఖను విడుదల చేసిన వారిలో అనీ రాజాతోపాటు మహిళా హక్కుల నేతలు ఫరా నక్వీ, అంజలి భరద్వాజ్‌, వాణీ సుబ్రమణ్యం, మీరా సంఘమిత్ర, మరియం ధావ్లే, పూనమ్‌ కౌశిక్‌ తదితరులు వున్నారు. ఈ సందర్భంగా అనీ రాజా మాట్లాడుతూ, మహిళల పేరుమీద దేశంలో భూమి గానీ, ఆస్తులు గానీ పెద్దగా లేవని, అలాగే వారిలో నిరక్షరాస్యత శాతం చాలా తక్కువని, వారి గుర్తింపునుగానీ, పెళ్లికి సంబంధించిన పత్రాలుగానీ వుండటమే చాలా అరుదు అని చెప్పారు. ఎన్‌ఆర్‌సి కారణంగా అసోంలో 19 లక్షల మందిని గుర్తింపు లేని వారిగా గుర్తించగా, వారిలో మెజారిటీ జనం మహిళలేనని అనీ రాజా తెలిపారు. ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి, పౌరసత్వ కొత్త విధానం కారణంగా కుల, మతాలతో సంబంధం లేకుండా మహిళలందరిపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివాసీలకు చెందిన మహిళలు, పిల్లలు, దళిత మహిళలు, ముస్లిం వనితలు, వలస కార్మికులు, చిన్నరైతులు, భూమిలేని పేదలు, ఇంటిపనివారలు, సెక్స్‌ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు…ఇలా ప్రతి ఒక్కరూ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడి పత్రాలు తీసుకురావాలని ప్రశ్నించారు. మోడీ సర్కారు విధానం ఎంతో అన్యాయంగా వుందని ఆవేదన వెలిబుచ్చారు. ఫరా నక్వీ, అంజలీ భరద్వాజ్‌లు పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 14ఎతోపాటు వివిధ నిబంధనలను ప్రస్తావిస్తూ, ఎన్‌ఆర్‌ఐసిని సంగ్రహపరిచేందుకు ఎన్‌పిఆర్‌ డేటాను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేస్తున్నాయని, ఫలానా వ్యక్తులు పౌరులా కాదా అన్న సందేహ ముద్రను వేసే అధికారాన్ని స్థానిక రిజిస్ట్రార్లకు కల్పిస్తున్నాయని వివరించారు. పౌరులపై ఎలాంటి సందేహముద్రను వేసేది లేదని మార్చి 12న హోంమంత్రి ప్రకటించినప్పటికీ, ఆయన ప్రకటనకు ఎలాంటి చట్టబద్ధత లేదని, ఎందుకంటే మాటలతో ఇది సరిపోదని, తక్షణమే చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పిఆర్‌ ప్రక్రియపై కేరళ, పశ్చిమబెంగాల్‌లు ఇప్పటికే స్టే విధించాయని, రాజస్థాన్‌, జార్ఖండ్‌లలో కేవలం జనగణనకు మాత్రమే ఆదేశాలు ఇచ్చాయని, ఈ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందిస్తున్నామని మహిళా హక్కుల నేతలు అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించి, తక్షణమే ఎన్‌పిఆర్‌ ప్రక్రియను అడ్డుకోవాలని, కేవలం జనగణనకు మాత్రమే అనుమతినివ్వాలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?