రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీద్దాం :సిపిఐ(యం) రాష్ట్ర కమిటి రాజకీయ తీర్మానం

రాజకీయ తీర్మానం
(భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆగస్టు 20`21తేదీలలో విజయవాడలో వి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరయ్యారు. సమావేశం ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాము.
`పి. మధు, రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ)

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర వివక్షపై పోరాడుదాం ` ఫెడరల్‌ లౌకిక వ్యవస్థను కాపాడుకుందాం
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీద్దాం
` రాష్ట్ర ప్రజలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటి విజ్ఞప్తి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బిజెపి కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలోను మన రాష్ట్రం పట్ల వివక్షతాపూరిత వైఖరినే కొనసాగిస్తున్నది. కరోనా నివారణకు సకాలంలో సరిపడిన వ్యాక్సిన్‌ అందించలేదు. మరణాల సంఖ్యను తగ్గించి చూపించడమే కాకుండా ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ చనిపోలేదని పార్లమెంటు సాక్షిగా బుకాయించింది. ప్రజల కొనుగోలు శక్తి పెంచే పద్దతిలో సామాన్య ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం లేదు. హానికరమైన లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలతో కార్మిక కర్షక ప్రయోజనాలను హరిస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలను, ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షాలు, మేధావులపై గూఢచారి చర్యలు, నిర్బంధాలను ప్రయోగిస్తున్నది. పెగాసెస్‌ నిఘా కుంభకోణం తాజా ఉదాహరణ. సమాచార హక్కులను నీరుగారుస్తున్నది. అటవీహక్కుల చట్టాన్ని ధిక్కరించి గిరిజనులను భూముల నుండి వెళ్లగొడుతోంది. ఉపాధిహామీ, భూసేకరణ చట్టాలను బలహీనపరుస్తోంది. సామాన్యులకు అందుబాటులో ఉన్న రైల్వేలను ప్రైవేటుపరం చేస్తోంది. పెట్రోలు, డీజల్‌పై పన్నులు, సెస్సులు పెంచుకుంటూ పోతున్నది. దీనితో ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే భూమి, మైనింగు వంటి సహజవనరులపై కార్పోరేట్లకు ఆధిపత్యం కల్పిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించే పేరుతో మొత్తం కాలువలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్‌ ఉత్పత్తిపై సర్వాధికారాలను తన గుప్పిట్లోకి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న వ్యవసాయం, విద్యుత్‌ రంగాలను ఇప్పటికే వశం చేసుకున్న కేంద్రం తాజాగా సహకార వ్యవస్థను నాశనం చేయడానికి చట్టం తెచ్చింది. జిఎస్‌టిపై రాష్ట్రానికి రావలసిన పరిహారాన్ని ఇవ్వకుండా అప్పుగా తెచ్చుకునేందుకు షరతులు విధించింది. ఈ షరతులకు లోబడిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం, విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు ఇవ్వడం లాంటి అదనపు భారాలను మోపింది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజల పోరాట చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రతిఘటనను కూడా లెక్కచేయకుండా మొండిగా ప్రైవేటీకరించ పూనుకుంటున్నది. కడప ఉక్కు, విశాఖలో రైల్వే జోన్‌ నిర్ణయమై రెండేళ్ళయినా ఇంతవరకూ అమలులోకి రాలేదు. పోలవరం నిర్వాసితులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఆపేసింది. సంక్షేమ శాఖ నిధులపై కోత విధించింది. మతం పేరుతో చీలికలు పెట్టి విద్వేషాలు రగుల్చుతున్నది. రాష్ట్రంలో బిజేపీ ప్రజాసమస్యలు గాలికొదిలేసి మత విద్వేషాలు సృష్టించడంలో మునిగిపోయింది. ఎస్సీ కమిషన్‌ ద్వారా కేంద్రం నుండి ఆదేశాలు జారీచేసి రాష్ట్రంలోని దళితుల్లో మతం పేరుతో విభజన తీసుకొచ్చి విద్వేషాలు రగులుస్తోంది. ఇలా అన్ని విధాలా కేంద్రం వివక్షత, పక్షపాత ధోరణి కొనసాగిస్తున్నది. రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజలపై భారాలు మోపడమే కాకుండా తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ముందుకు రావాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి విజ్ఞప్తి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యను ఎండగట్టి రాష్ట్ర ప్రయోజనాల రక్షణకు పూనుకోవలసింది పోయి బిజెపి కేంద్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తున్నది.
రాజ్యాంగ ఫెడరల్‌ స్పూర్తిని, లౌకిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న కేంద్రంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు నోరు మెదపడం లేదు. రెండు పార్టీలు పోటీ పడి పార్లమెంటులో బిజెపిని బలపరుస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతునిస్తున్నాయి. పెగాసెస్‌, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో అన్ని ప్రతిపక్షాలు పోరాడుతున్నప్పటికీ వారితో కలవకుండా బిజేపీ సరసన నిలబడ్డారు. పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెరిగినా నోరు మెదపడం లేదు. పైగా బిజెపి తప్పుల్ని కప్పిపెట్టడానికి తెలుగుదేశం ప్రయత్నించడం కేంద్ర నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఫెడరల్‌ లౌకిక విధానాలను బలపరచాలన్న ఆపార్టీ మౌలిక సూత్రానికే విరుద్దం. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బిజెపి నిరంకుశ విధానాలకు మద్దతునిస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీల వైఖరులు రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. బిజెపికి మద్ధతునివ్వడమే కాకుండా దానిపై పోరాడుతున్న శక్తులపై నిందా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రప్రయోజనాల పరిరక్షణకై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావలసిందిగా లౌకిక ప్రజాస్వామ్య పార్టీలకు, శక్తులకు సిపియం విజ్ఞప్తి చేస్తున్నది.
రాష్ట్రం హక్కుల కోసం పోరాడాల్సిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బిజేపీ విధానాలను రాష్ట్రంలో అందరికన్నా ముందు అమలు జరపడానికి పూనుకుంటున్నది. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచడం పేద, మద్యతరగతి ప్రజలకు భారం కానున్నది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులకోసం నిలదీయకుండా స్థానిక సంస్థలను ఎండగట్టడం, వారి నిధులను వారే స్వయంగా సమకూర్చుకోవాలనడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూములను పేదల నుండి లాగేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీని వల్ల గిరిజన నిరుద్యోగులకు అవకాశాలు పడిపోతాయి. కోర్టులో రెవ్యూ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు దీన్ని అమలు చేస్తున్నది. గిరిజనులు మెజారిటీగా ఉన్న గ్రామాలను షెడ్యూలు ఏరియాలో కలపాలని అడ్వయిజరీ కమిటీ సిఫార్సు చేసి రెండేండ్లయినా అమలు చేయలేదు. సిపిఎస్‌ రద్దు చేస్తామన్న వాగ్ధానాన్ని విస్మరించారు. భవన నిర్మాణ కార్మికుల నిధిని ఖజానాలో కలిపివేసుకుని వారి క్లెయిమ్‌లు పరిష్కరించడంలేదు. 2010 తర్వాత కార్మికుల కనీసవేతన జీవోలను సవరించ లేదు. నూతన విద్యా విధానం పేరుతో అంగన్‌వాడీలను, ఉపాధ్యాయులను తొలగించే ప్రమాదం ఏర్పడిరది. డ్రాపవుట్స్‌ పెరుగుతాయి. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో 13,000కే పరిమితం చేశారు. వివిధ స్థాయిల్లో అధికార పార్టీ నాయకుల అవినీతి, భూదందా విచ్చలవిడిగా సాగుతోంది. తమ హక్కుల కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న ప్రజలపై ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తోంది. దళితులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన రమ్య విషాద ఘటనతో సహా గత ఎనిమిది మాసాల్లోనే మహిళలపై 985 అత్యాచార కేసులు నమోదయ్యాయంటేనే సమస్య తీవ్రత అర్దమవుతుంది.
ఆర్ధిక సంక్షోభం, కరోనా కష్టాలతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. అయితే వీటిపై కోత విధించే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది అభివృద్ధి పేరుతో సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారు. ఇలా అభివృద్దికి, సంక్షేమానికి పోటీ పెట్టడం సరైంది కాదని సిపిఐ(యం) భావిస్తున్నది. అయితే సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను కేంద్రంపై పోరాడి తెచ్చుకోవడానికి బదులు ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆస్తి పన్ను పెంపును తక్షణం ఉపసంహరించుకోవాలని, పెట్రోలు, డీజిల్‌పై పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల తరహాలో తమకొస్తున్న సుంకంలో కొంత తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాం. గిరిజన యువతకు ఉద్యోగవకాశాలు కల్పించే జీవో 3ని పునరుద్దరించాలి. 1/70ని అమలు చేయాలి. భూఅసైన్డు చట్ట సవరణను ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ బకాయిల్ని వెంటనే చెల్లించాలి. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. ప్రాథమిక విద్యను బలహీనపరుస్తున్న నూతన విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలి. పేదలకు స్థలాలిచ్చినా ఇండ్లు కట్టుకోడానికి పూర్తిస్తాయిలో సహాయం చేయాలి. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్దిదారులకు స్వాధీనం చేయాలి. ప్రాథమిక విద్యను చీల్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు, పిఆర్‌సిపై చేసిన వాగ్దానం అమలు చేయాలి.మహిళలకు రక్షణ కల్పించాలి. అత్యాచారబాధిత కుటుంబాలను ఆదుకోవాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి రక్షణ కల్పించాలి. నిబంధనల పేరుతో సంక్షేమపథకాలపై కోత విధించరాడు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న భారాలను ప్రతిఘటించాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటి పిలుపునిస్తున్నది.
తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ తరగతుల, వర్గాల ప్రజల ఉద్యమాలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటి సంపూర్ణ సంఫీుభావం ప్రకటిస్తున్నది. స్వతంత్రంగాను, వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో కలసి ఉమ్మడిగాను ఆందోళనలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో సిపిఐ(యం) పైనా, వివిధ ప్రజాసంఘాలపైనా తీవ్ర నిర్భంధం సాగుతున్నది. ఎక్కడకు ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినా ముందుగా సిపియం నాయకులనే అరెస్టు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లాగానే వైయస్సార్‌ సిపి ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాల గొంతు నొక్కాలని చూస్తున్నది. ప్రజా ఉద్యమాలపై ఈ రకమైన నిర్భంధాన్ని ఖండిరచాల్సిందిగా ప్రజాస్వామిక శక్తులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తూ ప్రజల కష్టాలకు కారణమైన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 15 డిమాండ్లతో దేశవ్యాప్త ఆందోళనకు సిపిఐ(యం) కేంద్ర కమిటి పిలుపునిచ్చింది. మన రాష్ట్రంలో సెప్టెంబరు 15 నుండి 30 వరకు వివిధ రూపాలలో ఆందోళనలు సాగనున్నాయి. విజయవాడ, విశాఖ, కర్నూలు, తిరుపతి సహా అన్ని జిల్లా కేంద్రాలలోను కరోనా నిబంధలనలకు లోబడి సభలు నిర్వహించాలి. వీటికి కేంద్ర, రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతారు. 19 నుండి 21 వరకు ఇంటింటా ప్రచారం, 24 తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద, 27, 28 తేదీలలో మండల, పట్టణ కేంద్రాల్లో, 30న జిల్లా, రాష్ట్ర కేంద్రాలలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయి. ప్రజలంతా వీటిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతోంది. అభ్యుదయ, లౌకిక శక్తులంతా ఈ ఆందోళనలకు మద్దతివ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి విజ్ఞప్తి చేస్తున్నది.

సెప్టెంబర్‌ 15 నుండి 30 వరకు జరిగే ఆందోళలనకు సిపిఐ(యం) పిలుపు

చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ :
(1) యూనివర్సెల్‌ వ్యాక్సినేషన్‌ అమలు జరపడానికి వీలుగా వ్యాక్సినేషన్‌ వనరులున్నింటిని దేశీయంగానూ, విదేశాల నుండి ప్రొక్యూర్‌ చేసి తక్షణం అందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ అందించాలి. కోవిడ్‌తో మరణించినవారికి సముచితమైన నష్టరిహారం అందించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య వ్యవస్థను విస్తృతపరచాలి.
(2) ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పరిధిలో లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500లు అందించాలి.
(3) కేరళలో మాదిరిగా అవసరమైన అందరికీ నిత్యావసర వస్తువులతో రోజువారీ భత్యం అందించాలి.
(4) అధిక ధరలను అదుపు చేయడానికి పెట్రోలు ఉత్పత్తుల మీద కేంద్రం విధించిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సర్‌ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి.
(5) రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. రైతు ఖర్చులో 50% మిగులు ఉండేలా గిట్టుబాటు ధరలు అందించడానికి వీలుగా చట్టం తేవాలి.
(6) ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణ ఆపాలి. ఇప్పటికే చేసిన వాటిని ప్రభుత్వ రంగంలోకి పునరుద్దరించాలి.
(7) లేబర్‌ కోడ్‌ చట్ట సవరణలు రద్దు చేయాలి. సమ్మె హక్కు, వేతనాల సంప్రదింపుల హక్కు లాంటి కార్మిక హక్కుల్ని పునరుద్దరించాలి.
(8) యం.ఎస్‌.ఎన్‌.ఈ.ల మనుగడకు అప్పులిచ్చే దాని స్థానంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి.
(9) గ్రామీణ ఉపాధిహామీ పథకం 200 రోజులకు విస్తరింపజేయాలి. వేతనాలు రెట్టింపు చేయాలి.
(10) గ్రామీణ ఉపాధిహామీ పథకం లాంటి పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేయాలి.
(11) ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచి ఆర్థిక పునరుద్దరణకు చర్యలు చేపట్టాలి. మౌళిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు కలిగించాలి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు నింపాలి.
(12) వ్యాక్సినేషన్‌ అందించడంలో విద్యా రంగంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే విద్యా సంస్థలు ప్రారంభించాలి.
(13) పెగాసెస్‌ మిలటరీ స్పైవేర్‌ వినియోగంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జ్యుడిషియల్‌ ఎంక్వయిరీ కమిటీ నియమించి వెంటనే వాస్తవాలు వెలుగులోకి తేవాలి.
(14) రాఫెల్‌ ఒప్పందాలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసి కొత్త ఒప్పందాన్ని నివారించాలి.
(15) ఉపా చట్టం క్రింద, భీమాకొరెగావ్‌ కేసులోనూ, సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లోనూ అరెస్టు చేయబడిన రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి. దేశద్రోహ చట్టాలు, ఎన్‌ఎస్‌ఏ లాంటి సంస్థల్ని వినియోగించి పౌర హక్కుల్ని హరించే చర్యలకు స్వస్తి చెప్పాలి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అక్రమ ఆరోపణలతో అరెస్టు చేయబడిన మీడియా ప్రతినిధులను విడుదల చేయాలి. జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ కారణాలతో అరెస్టు చేయబడిన వారందరికీ వెంటనే విడుదల చేయాలి.

DO YOU LIKE THIS ARTICLE?