దేశంలో పాక్షిక నిర్బంధం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ చెలరేగుతుండటంతో చేసేది లేక భారత ప్రభుత్వం పాక్షికంగా నిర్బంధం విధించింది. సినీ స్టార్లు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు దాదాపుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలాఖరు వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని నిర్ణయించుకున్నారు. సినీ షూటింగ్‌లు కూడా బందయ్యాయి. కొంతమంది కేంద్ర, రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ఇక ఢిల్లీ, ముంబయి ప్రాంతాలతోపాటు దేశవ్యాప్తంగా స్కూళ్లు, సినిమా హాళ్లు, పాక్షికంగా మాల్స్, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. నాలుగైదు రోజులుగా ఇదేపరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణలో విద్యాసంస్థలకు, ధియేటర్లకు సెలవులు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు దాన్ని అనుసరించాయి. కేరళలో ఎప్పటి నుంచో ఇది కొనసాగుతోంది. కరీంనగర్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు గుమిగూడవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా చాలావరకు అవగాహన చేసుకొని, బయటకు రావడం లేదు. అన్ని నగరాల్లోనూ రోడ్లు నిర్మానుష్యంగా వుంటున్నాయి. ఐటి, ఇతర కంపెనీలు హోం టు వర్క్‌ను అమలు చేస్తుండగా, కొన్ని సంస్థలు పూర్తిగా సెలవులు ప్రకటించేశాయి. ఎటొచ్చీ పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, మీడియా సంస్థలు, వాటికి సంబంధించి ఉద్యోగులు మాత్రమే పూర్తిస్థాయిలో పని చేస్తున్నారు. కోర్టులు పాక్షికంగా సెలవులు ప్రకటించాయి. సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెరతీయంగా, తెలంగాణ హైకోర్టుతో సహా వివిధ కోర్టులు దీన్ని అనుసరించాయి. కొన్ని కోర్టులు వారానికి మూడు రోజులు మాత్రమే, స్వల్ప కాలం మాత్రమే పనిచేయాలని నిర్ణయించాయి. అది కూడా అత్యవసర కేసులకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నాయి. ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతుండగా, తాజాగా వాటికి కూడా బ్రేక్ పడింది. తెలంగాణలో టెన్త్ పరీక్షలను నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఎపిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భావిస్తున్నారు. గాయని కానికా కపూర్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా అనుమానిస్తుండగా, ఆ పార్టీకి వెళ్లి వచ్చిన రాజకీయ నేత దుష్యంత్ సింగ్, తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రియన్‌లు స్వీయ నిర్బంధం విధించుకున్నారు.