తెలంగాణలో మరో 3 కరోనా కేసులు

రాష్ట్రంలో 19కి చేరిన కొవిడ్‌-19 కేసుల సంఖ్య

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపతున్నప్పటికీ, కరోనా తన దూకుడు ప్రదర్శిస్తూనే వుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 10 గంటలకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయం వెల్లడించారు. ఈ ముగ్గురూ విదేశాల నుంచి వచ్చినవారే, లండన్‌ నుంచి వచ్చిన హైదరాబాదీ మహిళతోపాటు మరో ఇద్దరు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ మహిళను నగరంలోని టిబి చెస్ట్‌ హాస్పిటల్‌లో చేర్పించగా, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుందని ఆ ప్రకటన తెలిపింది. ఇక మిగిలిన ఇద్దరు ఇండోనేషియన్లు కరీంనగర్‌లో తిష్టవేసిన ఇండోనేషియన్ల గ్రూపుకు చెందిన వారే. గత వారంలో రెండు రోజులపాటు వీరిద్దరూ కరీంనగర్‌లో తిరిగారు. పది మంది గ్రూపులో ఇప్పటికే ఎనిమిది మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. తాజాగా మిగిలిన ఇద్దరు కూడా ఆ కోవకే చెందినవారని తేలింది. వారిలో కొవిడ్‌ 19 వ్యాధి లక్షణాలు కన్పించగానే ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో కొవిడ్‌ 19 పాజిటివ్‌ ఉన్నట్లు బయటపడింది. వారికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి పెరిగింది.

DO YOU LIKE THIS ARTICLE?