నా చూపు అక్కడే
‘ఇస్మార్ శంకర్’ ఏడాది పూర్తయిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు – ఛార్మీ కౌర్
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిర్మాతగా తన తొలి విజయాన్ని రుచి చూశారు నటి ఛార్మీ కౌర్. రామ్ హీరోగా, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా అందరి ఆదరాభిమానాలు పొందిన ఆ సినిమా విడుదలై జూలై 18కి ఏడాది పూర్తయింది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదని చార్మి వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విశేషాలు…
‘ఇస్మార్ శంకర్’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
నిజానికి, కరోనా వల్ల ఈ సందర్భాన్ని మేం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మేమంతా సెల్ఫ్-క్వారంటైన్ మెయిన్టైన్ చేస్తున్నాం. రామ్ ఫ్యాన్స్ అందరినీ కరోనా నిబంధనలను పాటిస్తూ, క్షేమంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌ను ఎలా అభివర్ణిస్తారు?
ఈ విజయం చాలా చాలా అవసరం. ఈ సక్సెస్ కోసం మేం ఎదురుచూశాం. షూటింగ్ కాలంలో మంచి ఎనర్జీతో పనిచేశాం. మేం చేస్తున్న ప్రాజెక్ట్‌పై అందరం ఎప్పుడూ నమ్మకం ఉంచాం. ఒక హిట్ రావడానికి కావాల్సిన ఫైర్ మాలో ఉంది. రామ్‌కు పూరి కథ చెప్పినప్పట్నుంచీ, చివరి దాకా అవే ఎనర్జీ లెవల్స్‌ను మెయిన్టైన్ చేశాం.
రామ్ కంటే ముందు ఈ సినిమా కోసం మరికొంతమంది నటుల్ని అనుకున్నారనే ప్రచారంలో నిజమెంత?
ఈ స్క్రిప్ట్‌ను రామ్ కోసమే పూరి ప్రిపేర్ చేశారు. గోవాలో పూరి ఈ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నప్పుడు అక్కడ రామ్ కూడా ఉన్నాడు. వాళ్లు స్క్రిప్ట్‌తో హైదరాబాద్ తిరిగి వచ్చే సమయానికి, ఇక్కడ నేను ప్రి-ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాను.
స్క్రిప్ట్ విషయంలో మీరు పూరి గారికి ఏవైనా సలహాలిస్తుంటారా?
లేదు. పూరి ఏదైనా స్క్రిప్ట్ పూర్తి చేస్తే, మాకు డైలాగ్ వెర్షన్ వినిపిస్తారు. ఆయనతో మేం నిజాయితీగా వ్యవహరిస్తాం. సలహాలను ఆయన చాలా పాజిటివ్‌గా తీసుకుంటారు. ‘ఇస్మార్ట్ శంకర్’ స్టోరీని ఆయన మాకు నెరేట్ చేసినంతసేపూ మేం చప్పట్లు కొట్టాం, విజిల్స్ వేశాం, నవ్వుతూనే ఉన్నాం. సినిమా థియేటర్లలోనూ అలాంటి రెస్పాన్స్‌నే చూశాం.
మీకు మళ్లీ నటించే ఆలోచనలేమైనా ఉన్నాయా?
ప్రస్తుతం నా దృష్టి నటన మీద లేదు. యాక్టింగ్ కమ్‌బ్యాక్ గురించి ఎలాంటి ప్లాన్స్ నాకూ లేవు. తర్వాత ఏంటనే ఆలోచన వచ్చినప్పుడు, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టాలనిపించింది. ఇవాళ, నా దృష్టంతా ప్రొడక్షన్ పైనే పెట్టాను. ఇప్పుడు చేస్తున్న దానితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పూరి కనెక్ట్స్ మీదే నా ఫోకస్ అంతా పెట్టాను.
‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ ఉంటుందా?
మళ్లీ కలిసి పనిచెయ్యాలని పూరి, రామ్.. ఇద్దరికీ ఉంది. అది సీక్వెలా లేక వేరే సబ్జెక్ట్ చేస్తారా.. అనే విషయం ఇప్పుడే నేను చెప్పలేను. కానీ, ఫ్యూచర్లో ఆ ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తారు. రామ్ అంటే పూరికి చాలా ఇష్టం. ఒక్కటి మాత్రం చెప్పగలను, వాళ్ల కలయికలో వచ్చే నెక్ట్స్ ఫిల్మ్‌కు ఒక అసాధారణ స్క్రిప్ట్ కోరుకుంటున్నాం.
విజయ్ దేవరకొండతో చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్ ఏమిటి?
ఇప్పటికైతే ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాం. పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని భాషలకూ సరిపోయే టైటిల్‌ను ఖాయం చేస్తాం.
లాక్డౌన్ కాలంలో పూరి గారు ఎన్ని స్ర్కిప్టులు పూర్తి చేశారు?
నాలుగు నెలలుగా ఆయన రాయడం మీదే దృష్టి పెట్టారు. ఒక విషయం ప్రామిస్ చెయ్యగలను.. పూరి కనెక్ట్స్ నుంచి కడుపు నింపే, హృదయం నింపే కంటెంట్‌ను మీరు చూడబోతున్నారు. వచ్చే పదేళ్ల కాలానికి మేం రెడీ అవుతున్నాం. మా తర్వాతి ప్రాజెక్ట్స్ ఏమిటనేవి ఒకదాని తర్వాత ఒకటిగా ఎనౌన్స్ చేస్తాం. పూరి తీసే తర్వాతి సినిమాలన్నీ బహుశా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్గానే ఉంటాయి.
ఓటీటీ కోసం పూరి కనెక్ట్స్ కంటెంట్ తయారుచేస్తుందా?
ఇప్పుడు ఓటీటీకి ఆదరణ బాగుంది. చాలా మంది ప్రొడ్యూసర్లకు అది హెల్ప్ చేస్తోంది. అటు నిర్మాతలకూ, ఇటు దర్శకులకూ ఓటీటీ అనేది కచ్చితంగా ఒక పాజిటివ్ హోప్. ఓటీటీ కోసం మేం కూడా కంటెంట్‌ను క్రియేట్ చేస్తాం. ఆ పని కూడా సినిమాలతో పాటే జరుగుతుంది. ఏదైనా కానీ, బాగా ఇంపాక్ట్ చూపే దాన్ని చెయ్యాలని అనుకుంటున్నాం. పూరి నుంచే ఎక్కువ స్క్రిప్టులు వస్తాయి. పూరి మైండ్‌ను కూడా డైరెక్ట్ చేసే కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చెయ్యాలనుకుంటున్నాం.