విజయపథాన మరిన్నిప్రయోగాలు

చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నిర్వహించడం అంతరిక్ష పరిశోధన రంగంలో మనకు ఓ మహాద్భుతం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనే అమెరికా, రష్యాలు పోటీపడి మరీ చంద్రునిపై మానవ రహిత, మానవ సహిత ప్రయోగాలు నిర్వహించి కీర్తిపతాకాలు ఎగురవేశాయి. మనం చంద్రునిపై పరిశోధనకు ఒక ఉపగ్రహాన్ని పంపించడానికి ఏభయ్యేళ్లు పట్టినా, దాదాపు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అది సాధించడం చరిత్రాత్మకం. పైగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంత గొప్పగా అందిపుచ్చుకోవడం వెనుక మన శాస్త్రవేత్తల కృషి శ్లాఘనీయం. చంద్రునిపై ప్రయోగాల కోసం అమెరికా ఏకంగా 15 అపోలో ప్రయోగాలు నిర్వహించింది. రష్యా అదే బాటలో స్పుత్నిక్‌ ప్రయోగాలు జరిపింది. ఈ క్రమంలో ఈ రెండు దేశాలు పలు వైఫల్యాలను కూడా మూటగట్టుకున్నాయి. 1969లో అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై అడుగుపెట్టిన తొలి మానవునిగా చరిత్ర సృష్టించాడు. అయితే అక్కడికి మానవులను అదేపనిగా పంపించడం కన్నా అక్కడి వాతావరణ, ఉపరితల నిర్మాణం, జలాల జాడలు, గనులు, ఖనిజాల గురించి తెలుసుకోవడం అతి ముఖ్యమని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు భావించారు. అందుకే ఆనాటి నుంచి చంద్రునిపై మానవ రహిత ప్రయోగాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అప్పటి నుంచి భారత్‌ కూడా అంతరిక్ష పరిశోధనలపై దృష్టిపెట్టినా, జాబిలిపైకి ఓ ఉపగ్రహాన్ని పంపించాలన్న బలమైన ప్రయత్నం 2008 వరకు జరగలేదు. చంద్రయాన్‌ 1 పేరుతో జరిగిన ఆ ప్రయోగం తొలి అంకంలో విజయం సాధించినా, దాని ప్రయాణం కక్ష్యకే పరిమితమైంది. పది నెలలకే దాని కథ ముగిసింది. కాకపోతే తన పరిధిలో చంద్రయాన్‌ 1 తీసిన పలు చిత్రాలు మన కన్నా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఉపయోగపడ్డాయి. చంద్రయాన్‌ 1 తీసిన పలు చిత్రాల ఆధారంగానే చంద్రునిపై నీటిజాడలు, ఇతర అంశాలపై కొన్ని కీలక అభిప్రాయాలను ఏడాది క్రితమే నాసా విడుదల చేసింది. అంటే ఒక గొప్ప స్ఫూర్తితో చేసిన పరిశోధన ఉపయోగపడకుండా ఉండబోదన్న శాస్త్రవేత్తల వాదనలు నిజమయ్యాయి. వాస్తవానికి చంద్రయాన్‌ 1లో ఉపయోగించిన అమెరికా తయారీ పేలోడ్‌ (110 గ్రాములు) పనిచేయక పోవడం వల్లనే ఆనాటి ప్రయోగం పరిపూర్ణత సాధించలేకపోయింది. అమెరికా సాంకేతికత అంత గొప్పదేమీ కాదని ఆ ప్రయోగంలో తేలిపోయింది. అప్పటికే అంతరిక్ష పరిశోధన రంగంలో అమెరికా వెనుబడుతూ రావడం, చైనా ముందడుగు వేస్తూ తన ఉనికిని చాటుకోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఆ అనుభవంతోనే భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంపై పూర్తిగా దృష్టి సారించింది. అందుకే చంద్రయాన్‌ 2లో ఉపయోగించిన 14 పరికరాల్లో 13 మన స్వంత పరిజ్ఞానంతో సాధించినవే. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌ పురోగమిస్తుందనడానికి ఇదొక మచ్చుతునక. ఆ సమయంలో యుపిఎ ప్రభుత్వం అందించిన సహకారం చెప్పుకోవాల్సిందే. దాని ఫలితమే చంద్రయాన్‌ 2. ఈ కొత్త ప్రయోగ పరిణతి వెనుక మోడీ ప్రభుత్వం తోడ్పాటు బహు స్వల్పం. ఈ విజయం పూర్తిగా శాస్త్రవేత్తల నిబద్ధతకు నిదర్శనం, నిలువుటద్దం. ముఖ్యంగా చందమామపై అడుగుపెట్టాలన్న లక్ష్యానికి పునరంకితం కావడం ప్రశంసనీయం. 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌ 2 ప్రయోగంతో చందమామ వాతావరణంపై అవగాహన పెంచుకోవడానికి, దాని ఉపరితల నిర్మాణాన్ని విస్తృతస్థాయిలో విశ్లేషించడానికి, ఉపరితలంపై జలాల జాడలను అన్వేషించడానికి మన దేశం ఓ ముందడుగు వేసినట్లయింది. అయితే చంద్రయాన్‌ 2 ప్రయోగ విజయం ఇంకా పరిపూర్ణం కాలేదు. తొలి అంకం మాత్రమే జయప్రదమైంది. చంద్రయాన్‌ 2కు చెందిన ఆర్బిటర్‌ కక్ష్యలో తిరుగుతుండగానే, దాని నుంచి విడివడే ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞాన్‌)లు సెప్టెంబరు 7వ తేదీన చంద్రునిపై అడుగుపెడతాయి. అలా జరిగితే, అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రునిపైన వ్యోమనౌకను సురక్షితంగా దింపిన నాల్గవ దేశంగా, అలాగే చందమామ దక్షిణ ధృవంపై రోవర్‌ను దింపిన తొలి దేశంగా భారత్‌ అవతరిస్తుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన తర్వాతనే చంద్రయాన్‌ 2 జయప్రదమైనట్లుగా భావించాల్సివుంటుంది. ఏదేమైనప్పటికీ, చంద్రయాన్‌ 2 ప్రయోగంలో కీలక విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. ఇస్రో తన తదుపరి లక్ష్యాలుగా నిర్ధారించుకున్న కీలక ప్రాజెక్టులు ఆదిత్య ఎల్‌ 1 (సూర్యునిపైకి పయనం), ఎక్స్‌పోశాట్‌ (విశ్వం పుట్టుకపై పరిశోధనలు), గగన్‌యాన్‌ (అంతరిక్షంలోకి మానవయానం), భారత అంతరిక్ష కేంద్రం, శుక్రయాన్‌, చంద్రయాన్‌ 3 వంటి ప్రయోగాలు కూడా విజయపథాన నడవాలని ఆశిద్దాం!

DO YOU LIKE THIS ARTICLE?