భూమిని తాకనున్న భారీ ఆస్టరాయిడ్‌

వాషింగ్టన్‌ : ఇటీవలనే రెండు ఆస్టరాయిడ్లు (గ్రహశకలాలు) భూమికి అత్యంత సమీపం నుంచి దాటుకుంటూ వెళ్లిపోయాయి. అవి భూమిని తాకకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆస్టరాయిడ్ల ముప్పు మాత్రం భూమిని ఇంకా వదల్లేదు. 700 అడుగుల వెడల్పు గల ఒక గ్రహశకలం 2023 ఆగస్టు 8వ తేదీన భూమిని తాకుతుంది. ఈ రాక్షస గ్రహశకలం ఎన్నో ముక్కలుగా విడిపోయి మరీ దూసుకువస్తున్నది. ఈ ఆస్టరాయిడ్‌ 2117వ సంవత్సరంలోపు 62 సార్లు భూమిని తాకుతుందని నాసా శాస్త్రవేత్తలు వార్నింగ్‌ ఇచ్చారు. నాసా ఆస్టరాయిడ్‌ వార్నింగ్‌ పేరుతో ఈ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా రెండింతల పొడవున్న ఎల్‌ఎఫ్‌16 అనే ఆస్టరాయిడ్‌ అత్యంత వేగవంతంగా దూసుకువస్తున్నదని నాసా పేర్కొంది. ఇదొక్కటే కాకుండా దానివెంట ఏకంగా 62 గ్రహశకలాలను తీసుకువస్తున్నది. ఈ ఆస్టరాయిడ్‌ 2023 ఆగస్టు 8వ తేదీన భారత్‌ను ఢీకొంటుందని, ఆ తర్వాత మళ్లీ 2024 ఆగస్టు 3వ తేదీన భూమిని ఢీకొంటుందని, అలాగే 2025 ఆగస్టు 1వ తేదీన తిరిగి వచ్చి ఢీకొంటుందని వెల్లడించింది. ఆ విధంగా ఈ గ్రహ శకలానికి చెందిన పెద్దపెద్ద తునకలు ఏడాదికోసారి 62 తేదీల్లో వచ్చి భూమిని తాకుతుందని పేర్కొంది. ఈ అంతరిక్ష రాయి భూమిని తాకడం ఖాయమని చెప్పలేమని, భూమిని ఢీకొనడానికి 3 కోట్లలో ఒక్క అవకాశం వుందని, అలాగే 99.9999967 శాతం మిస్సయ్యే అవకాశం వుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం భూమిపై పడితే చాలావరకు నష్టం సంభవిస్తుందని, మనుషులు వుండే ప్రాంతంలో పడితే మాత్రం భారీగా ప్రాణనష్టం సంభవిస్తుందని తెలిపారు. ఈ స్పేస్‌రాక్‌ లండన్‌లోని బిగ్‌బెన్‌ క్లాక్‌టవర్‌ కన్నా రెండింతలు పెద్దగాను, న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కన్నా రెండింతలు ఎత్తుగాను వుంటుందని, ట్రాఫాల్గర్‌ స్క్వేర్‌లోని నెల్సన్‌ కాలమ్‌ కన్నా నాలుగు రెట్లు పొడవుగా వుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద ఆస్టరాయిడ్స్‌ భూమిపై పడితే సహజంగానే విధ్వంసం భారీగానే వుంటుందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఇఎస్‌ఎ) కూడా వెల్లడించింది. అత్యంత శక్తివంతమైన అణుబాంబు టిసార్‌ బోంబా 50 మెగాన్‌ పేలుడు కన్నా పెద్దగానే విధ్వంసం జరుగుతుందని అంచనా వేశారు. వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారైనా ఇలాంటి గ్రహశకలం తాకిడి మన భూమండలానికి తప్పదని ఇఎస్‌ఎ పేర్కొంది. 65 మిలియన్‌ సంవత్సరాల క్రితం భూమిని తాకిన ఒకానొక ఆస్టరాయిడ్‌ కారణంగానే డైనోసార్లు అంతమైనట్లు ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?