భారత్‌కు అమెరికా క్షిపణులు

భారత్‌కు అగ్రరాజ్య ఆయుధాల అమ్మకం
హర్పూన్‌, టోర్పెడో క్షిపణుల విక్రయానికి నోటిఫికేషన్‌

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న తరుణంలో వివిధ దేశాలకు ప్రాంతీయ భద్రత పేరుతో ఆయుధాలను అమ్ముకుంటున్న అగ్రరాజ్యం తాజాగా భారతదేశానికి కూడా 15.5 కోట్ల అమెరికన్‌ డాలర్ల విలువైన నౌకావిధ్వంసక క్షిపణులు, టోర్పెడోలను విక్రయించాలని నిర్ణయించింది. గగనతలం నుంచి సముద్రతలంపై గల నౌకలను విధ్వంసం చేసే హర్పూన్‌ క్షిపణులతో పాటు మార్క్‌ 54 తేలికరకపు టోర్పెడోలను విక్రయించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా అమెరికన్‌ కాంగ్రెస్‌లో నోటిఫై చేసింది. భారత్‌ను అమెరికా 2016లోనే ‘అతిపెద్ద రక్షణ భాగస్వామి’గా గుర్తించింది. ప్రాంతీయంగా తమకు, తమ మిత్రదేశాలకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నట్లు గుర్తించి, భారత్‌ను రక్షణపరంగా మరింత బలపర్చే ఉద్దేశంతో ఈ ఆయుధాలను అమెరికా అమ్ముతోంది. అమెరికాకు చెందిన ఇతర మిత్రదేశాలు, భాగస్వాములతో సమానంగా భారత్‌ ఇకముందు కూడా అగ్రరాజ్యం నుంచి మరింత అధునాతన, సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుక్కోవచ్చని తాజా నోటిఫికేషన్‌లో అమెరికా వెల్లడించింది. 10 ఎజిఎం 84ఎల్‌ హర్పూన్‌ బ్లాక్‌ టు ఎయిర్‌ లాంఛ్‌డ్‌ క్షిపణుల విలువ 9.2 కోట్ల అమెరికన్‌ డాలర్లు వుంటుందని అంచనా. అలాగే 16 ఎంకె 54 ఆల్‌ అప్‌ రౌండ్‌ లైట్‌వెయిట్‌ టోర్పెడోలు, మూడు ఎంకె 54 ఎక్సర్‌సైజ్‌ టోర్పెడోల విలువ 6.3 కోట్ల అమెరికన్‌ డాలర్లు వుంటుందని అంచనా. భారత్‌కు ఆయుధ విక్రయానికి సంబంధించిన రెండు వేర్వేరు నోటిఫికేషన్లను సోమవారంనాడు అమెరికన్‌ కాంగ్రెస్‌కు పంపించినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ కో ఆపరేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?