రాజ్యసభకు 37 మంది ఏకగ్రీవం

న్యూఢిల్లీ : తెలంగాణ నుంచి కె.కేశవరావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఎన్‌సిపి అధ్యక్షులు శరద్‌ పవార్‌, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథావలేలు కూడా ఎన్నికయ్యారు. మొత్తంగా 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 18 స్థానాలకు ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఖాళీ అయిన 55 స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, బుధవారం నాటితో నామినేషన్‌ పత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, అలాగే హర్యానా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున, ఒడిశా నుంచి నలుగురు, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ల నుంచి ఐదుగురు చొప్పున ఎన్నికయ్యారు. వీరుగాక అస్సాం నుంచి ముగ్గురు, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఒకరు ఏకగ్రీవంగా గెలిచారని రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. ఒకే అభ్యర్థి రంగంలో వుండటంతో ఈ 37 స్థానాల్లో అభ్యర్థులను విజేతలుగా ప్రకటించినట్లు తెలిపారు. గత ఏడాది కాంగ్రెస్‌ను వదిలిపెట్టి శివసేనలో చేరిన ప్రియాంకా చతుర్వేది, ఎఐఎడిఎంకె నేత, లోక్‌సభ మాజీ ఉపసభాపతి ఎం.తంబిదురై, తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షులు జి.కె.వాసన్‌, సీనియర్‌ న్యాయవాది కె.టి.ఎస్‌.తులసి, కాంగ్రెస్‌ పార్టీ నేత దీపేందర్‌ సింగ్‌ హుడా తదితరులు ఎగువసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో వున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి నలుగురు, బిజూ జనతాదళ్‌ నుంచి నలుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలిచింది. రెండు ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్క స్థానంలో గెలిచింది. పశ్చిమబెంగాల్‌లో సిపిఐ(ఎం) అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచారు. తెలంగాణ నుంచి టిఆర్‌ఎస్‌ నాయకులు కె.కేశవరావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. కెకె ఇదివరకే రాజ్యసభ సభ్యుడు కాగా, సురేష్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్పీకర్‌ పని చేశారు. కాంగ్రెస్‌ నాయకుడైన ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెల్సిందే.

DO YOU LIKE THIS ARTICLE?