తెలంగాణలో మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు

మీడియాఫైల్స్‌/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నెమ్మదిగా పెరుగుతోంది. విదేశీయుల తాకిడి మొదట్నించీ ఎక్కువగా వుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా ఊహించినట్లుగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తంగా 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు 6వ కేసు వివరాలను వెల్లడించిన రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో విడుదల చేసిన బులిటెన్‌లో మరో 7 కేసుల వివరాలను వెల్లడించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కి చేరింది. బుధవారం నాటి 8 కేసులూ విదేశీయులే. 6వ కరోనా బాధితుడు స్కాట్లాండ్‌కు చెందిన పౌరుడు కాగా, మిగిలిన ఏడుగురు ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులు కావడం విశేషం. కరీంనగర్‌లో ఇండోనేషియా పౌరుడిపై వ్యక్తమైన అనుమానం నిజం కావడంతో అతనితోపాటు వున్న మిగిలిన ఏడుగురు ఇండోనేషియన్‌ పౌరులపై కూడా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ కొవిడ్‌ 19 పాజిటివ్‌ ఉన్నట్లు రుజువైంది. వీరందరూ సోమవారం నుంచే ఐసోలేషన్‌ వార్డుల్లో వున్నారు. ఆఖరి తొమ్మిది కేసుల్లోనూ పాజిటివ్‌ నిర్ధారణయిన బాధితులంతా విదేశీ పౌరులేనని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియాకు చెందిన పౌరులు కరీంనగర్‌లో ఖరాన్‌ నేర్చుకోవడానికి మనదేశంలోకి వచ్చినట్లుగా సమాచారం. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర విదేశీ పర్యాటకులపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం వుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, 8 కేసులు కరీంనగర్‌లో తచ్చాడిన ఇండోనేషియన్లే కావడంతో కరీంనగర్‌లో రెడ్‌అలెర్ట్‌ ప్రకటించారు. అత్యవసర పనులు వుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని ప్రభుత్వం ప్రజలను కోరింది.

DO YOU LIKE THIS ARTICLE?