భాగ్య‌న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాలు లెక్క‌లేన‌న్ని!

మీడియాఫైల్ లీగ‌ల్‌/హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాల‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేసిన జిహెచ్ఎంసి స‌మాధానం చెప్పుకోవ‌డానికి నానా తంటాలు ప‌డింది. ఒక విధంగా చెప్పాలంటే అధికారులు కోర్టులో నీళ్లు న‌మిలారు. హైద‌రాబాద్‌ మహానగరంలో 9400 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వీటిలో హైకోర్టు 2200, కింది కోర్టులు 2400 బిల్డింగ్స్‌ విషయంలో స్టే ఆర్డర్స్‌ జారీ చేశాయని హైకోర్టుకు జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ చెప్పారు. అక్రమ భవనాల్ని రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ 1.10 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీ వద్ద ఉన్నాయని, వీటి ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై 10600 ఫిర్యాదులు వస్తే అందులో 900 ఫేక్‌ అని తేలిందన్నారు. అక్రమ నిర్మాణాలపై దాఖలైన పిల్స్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. కాటేదాన్‌ ఇండ్రస్టీస్‌ కేసులో హైకోర్టుకు వచ్చిన కమిషనర్‌ ఈ కేసులోనూ హైకోర్టుకు వివరాలిచ్చారు. బెంచ్‌ అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులు చెప్పారు. స్టేలున్నాయన్న వివరాలు చెప్పడంపై బెంచ్‌ స్పందిస్తూ.. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు విచారణ చేస్తున్నందున కింది కోర్టులేవీ ఆ కేసుల్ని విచారించరాదని, మధ్యంతర స్టే ఉత్తర్వులు లాంటివి జారీ చేయరాదని ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణాలపై సర్కార్‌ వైఖరి ఏమిటో చెప్పాలని, ఒక్క అక్రమ నిర్మాణాల్ని నోటీసు కూడా ఇవ్వకుండానే కూల్చేస్తామంటూనే మరోపక్క అక్రమ నిర్మాణాల్ని రెగ్యులరైజ్‌ చేసేందుకు జీవోలు ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలివ్వాలని ఆదేశించిందిన హైకోర్టు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?