ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా
న్యూఢిల్లీ, మార్చి 1: ప్రపంచాన్ని కరోనా వైరస్ (కొవిడ్-19) గజగజలాడిస్తోంది. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకూ పాకింది. పశ్చిమాసియా, యూర్‌పలో అనేక ప్రాంతాల్లో కొత్తగా వ్యాప్తి చెందుతోంది. ఇరాన్లో 24 గంటల వ్యవధిలో మరో 11 మందిని బలి తీసుకుందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 54కు చేరింది. కొత్తగా నమోదైన 385 కేసులతో ఆ సంఖ్య 978కి పెరిగింది. అయితే ఇరాన్‌లోని వివిధ ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కరోనా సోకి 210 మంది మరణించారని బీబీసీ చెబుతోంది.
కేరళకు చెందిన 17 మంది జాలర్లు ఇరాన్లో చిక్కుకున్నారు. అక్కడ నుంచి పంపిన వీడియాను బట్టి వారంతా ఒక గదిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆంక్షల వల్ల బయటకు వెళ్లే పరిస్థితి లేదని వారు తెలిపారు. ఇరాన్‌లోని ఇతర నగరాల్లో కూడా తమ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఉన్నారని, కనీసం వారితోనైనా మాట్లాడే అవకాశం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాయం చేయాలని భారత అధికారులను వేడుకొన్నారు. చేపలు పట్టే పనికి నాలుగు నెలల క్రితం వారంతా ఇరాన్‌కు వెళ్లారు. జాలర్లతో పాటు పలువురు భారతీయులు ఇరాన్లో చిక్కుకుపోయిన సమాచారం అందిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆదివారం తెలిపారు. ఈ అంశంపై టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఇరాన్ అధికారులతో మాట్లాడుతోందని తెలిపారు. స్వదేశం వెళ్లిపోవాలనుకునే భారతీయులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబారి జి.ధర్మేంద్ర శనివారం తెలిపారు. ఇరాన్ పొరుగు దేశమైన ఆర్మేనియాలో కరోనా తొలి కేసు నమోదైనట్లు ప్రధాని నికల్ పషిన్యన్ వెల్లడించారు.