పోలీసుల తీరుపై ఆకుల విజయ ధ్వజం
తెలంగాణ రాష్ట్ర పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయ మండిపడ్డారు. పోలీసుల తీరు ఖాకీ చొక్కాలా కాకుండా గులాబీ రంగు చొక్కా వేసుకున్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. నారాయణ కళాశాలలో బిడ్డ చనిపోయిన దు:ఖంలో ఉన్న తండ్రిని బూటు కాలితో తన్నడమేనా బంగారు తెలంగాణ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు.. టీఆర్ఎస్ నేతలకు సలాం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో పోలీసుల తీరును ట్విట్టర్లో ప్రశ్నించిన కేటీఆర్కు తెలంగాణలో ఘటనలు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. ఆదిలాబాద్లో ఎస్సీ బిడ్డపై అఘాయిత్యం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనేక మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని..పోలీసులు ఏం చేస్తున్నారని ఆకుల విజయ మండిపడ్డారు.