కాంగ్రెస్‌ ఆత్మావలోకనం

వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఐదేళ్ల తర్వాత మూడోసారి కూడా ఓడిపోకుండా వుండాలంటే తక్షణ వ్యవస్థీకృత ప్రక్షాళన అవసరం. ఇప్పటికప్పుడు పరిశుద్ధమైన ఆత్మావలోకనం ఆ పార్టీకి అనివార్యం. అందుకే తొలి ప్రయత్నంగా కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యుసి సమావేశంలో ఎన్నికల ఘోర వైఫల్యంపై కొంతమేరకు ఆత్మావలోకనం చేసుకున్నట్లుగా కన్పించింది. అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజీనామాకు సిద్ధపడటం, ముగ్గురు సీనియర్‌ నేతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేయడం, ప్రియాంకాగాంధీ కూడా పార్టీ నేతలపై విరుచుకుపడటం….ఒక విధంగా సుదీర్ఘచరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీకి అవి కొత్త లక్షణాలే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికమని వారు చెప్పుకుంటున్నా, వంశపారంపర్య రాజకీయాలు సాగించే ఆ పార్టీ మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా అరుదు. అయితే ఈసారి కూడా యువరాజు, యువరాణిలే మాట్లాడారు తప్ప ఇతర నేతలు మౌనమే దాల్చారు. కాకపోతే ఎన్నడూ లేనంతగా ఆగ్రహావేశాలకు లోనుకావడం కొత్తదనమే.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితం కావడం విచారకరం. సిడబ్ల్యుసిలో రాహుల్‌, ప్రియాంకల ఆగ్రహావేశాల్లో నిజముంది. ముగ్గురు సీనియర్లు తమ కుమారులకు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడటం ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ సీట్లు ఇచ్చిన తర్వాత ఆ నేతలు ఆయా నియోజకవర్గాలకే ప్రచారాన్ని పరిమితం చేయడం తప్పిదం. అశోక్‌ గెహ్లాట్‌ తన కుమారుడు వైభవ్‌ను గెలిపించుకోవడానికి ఏడెనిమిది రోజులు అదే నియోజకవర్గంలో పనిచేస్తే రాష్ట్ర (రాజస్థాన్‌) వ్యాప్తంగా ఎవరు ప్రచారం చేస్తారు? పైగా ఆయన ముఖ్యమంత్రి పదవిలో వున్నారు. ఇంత జరిగినా వారసుడు గెలవలేదు. చిదంబరం, కమల్‌నాథ్‌లు కూడా అదే దారిలో పయనించారు. ఓవైపు కమల్‌నాథ్‌ సిఎంగా పాలన వెలగబెడుతున్నారు. చిదంబరమైతే సీటివ్వకపోతే రాజీనామా చేస్తానని కూడా బెదిరించారని స్వయంగా రాహుల్‌ గాంధీనే సిడబ్ల్యుసిలో ఆయన ముఖంమీదనే అనేశారని చెపుతున్నారు. దీంతో ప్రచారం వ్యూహాత్మకంగా సాగలేదన్నది సుస్పష్టం.
నరేంద్రమోడీని ఢీకొనడం అంత సులువైన విషయం కాదు. సమాన్యజనం నోళ్లలో నానే టీవాలా, చౌకీదార్‌ వంటి పదాల్నో, సామాన్య జనాన్ని ఆవహించే మత్తుమందులాంటి మతాన్నో క్షణాల్లో వాడుకొని అస్త్రాలు ప్రయోగించగల దిట్ట ఆయన. మోడీ ఒక్కడే దేశవ్యాప్తంగా తిరుగుతుంటే, ఆయన సహచరులు, అనుచరులు, ఇతర బిజెపి నేతలు ఆయనన్న మాటలనే పునఃప్రస్తావన చేస్తూ ఓటర్ల మనసులను ఏమార్చగలిగారు. కాంగ్రెస్‌లో అందుకు భిన్నంగా జరిగింది. రాహుల్‌ ఒంటరి పోరాటం స్పష్టంగా కన్పించింది. అందుకే ప్రియాంకాగాంధీ ఆగ్రహం ఇక్కడ సముచితమేనని చెప్పవచ్చు.
ఎన్‌డిఎ పక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి పోరాడాయి. కానీ కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు అన్ని అంశాలనూ ఏకోన్ముఖ అజెండాలోకి చేర్చగలిగినా, పొత్తులు, సీట్ల పంపకంపై వెనకంజ వేశాయి. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాలనాటి సంకుచిత ధోరణి నుంచి బయటపడలేక పోయింది. పొత్తులుంటే కాంగ్రెస్‌కు సీట్లు తగ్గుతాయని, ఆశావహులకు నిరాశ ఎదురవుతుందన్నది వాస్తవం. కానీ పొత్తుల్లేకపోతే, ఓట్లు చీలుతాయని, ఎర్రకోటపై మరోసారి కాషాయపతాకం ఎగురుతుందన్న చిన్న వాస్తవాన్ని ఎలా మిస్సయ్యారో అర్థంకావడం లేదు. ఈ అంశంపై సిడబ్ల్యుసిలో అంతగా చర్చించినట్లు లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం అతిగా వున్నా, ఆ పార్టీ రాజకీయాలన్నీ ‘గాంధీ’ చుట్టూనే తిరుగుతాయి. గాంధీ ట్యాగు లేకుండా ఆ పార్టీ బతకడం కష్టమన్నది క్షేత్రస్థాయి వరకు కాంగ్రెస్‌ వాదులు నమ్మే సిద్ధాంతం. ఇప్పటికిప్పుడు పి.వి.నరసింహారావు లాంటి గొప్పోడ్ని తీసుకురావడం కష్టమే. అయినప్పటికీ, రాజీనామాకు రాహుల్‌ సిద్ధపడటం గొప్ప విషయమే. ‘అనువంశిక రాజకీయాల్లేని కాంగ్రెస్‌’ భారత రాజకీయ వ్యవస్థకు మంచిదే, కానీ కాంగ్రెస్‌ పార్టీయే లేని భారత రాజకీయ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన హేతువు. అన్నింటికన్నా ముందు ఈ విషయాన్ని గ్రహించాల్సింది కాంగ్రెస్‌ పార్టీయే. ప్రముఖ మనోవైజ్ఞానిక నిపుణుడొకాయన అన్నట్లు ఆత్మావలోకనం అవసరమే, కానీ తూతూమంత్రంగా సాగే ఆత్మావలోకనం శుద్ధదండగ. ప్రతి పరాజయం తర్వాత ప్రతి పార్టీ చేసుకునే ఈ తరహా ఆత్మావలోకనం కాకుండా దేశానికి ముంచుకొచ్చిన మతోన్మాదాన్ని అడ్డుకునే దిశగా వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొనిపోయే విస్తృతార్థంలో ఉపయుక్తమయ్యేలా ఆత్మావలోకనం జరగడం అవశ్యం. ఇప్పటికైనా, విచ్ఛినకర శక్తులను ఎదుర్కొనే బాధ్యతను కాంగ్రెస్‌ తన భుజానకెత్తుకొని ప్రతిపక్షాలను ముందుండి నడిపించకపోతే, రానున్న ఐదేళ్లలో ఇంకెన్నో విపత్కర పరిస్థితులను దేశం చవిచూసే ప్రమాదం లేకపోలేదు.

DO YOU LIKE THIS ARTICLE?