అమెరికాలో హెల్త్‌ ఎమర్జెన్సీ

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా దెబ్బ తీవ్రస్థాయిలో పడింది. మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కరోనాను అరిక్టందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. “సమాఖ్య ప్రభుత్వ అధికారాలను అనుసరించి ఈరోజు (శుక్రవారం) జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నాను”అని శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ట్రంప్‌… ఈ ప్రాణాంతక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కూడా కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే, కరోనా టెస్టులు నిర్వహించి, దాదాపు గంటలోపే ఫలితాలు వెల్లడించేందుకు రెండు ల్యాబులను ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. డియాసోరిన్‌ మాలిక్యులర్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా, క్యూఐఏజెన్‌ ఆఫ్‌ మేరీల్యాండ్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 1.3 మిలియన్ల డాలర్లు ఖర్చుచేయనున్నట్లు సమాచారం. ఇక ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి రుణాలపై ఉన్న వడ్డీని మాఫీ చేయడంతో పాటుగా.. భారీ మొత్తంలో క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు చేయాల్సిందిగా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా కోవిడ్‌ దెబ్బకు అమెరికా విశ్వవిద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ప్రజా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అక్కడ నిరవధిక సెలవులు ప్రకటించారు. అదే విధంగా దేశంలోని ప్రతీ ఆస్పత్రి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అమెరికన్ల వైద్య అవసరాలన్నింటినీ తీర్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ట్రంప్‌ సూచించారు. అయితే అమెరికన్లంతా కరోనా పరీక్షల కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదని… వైరస్‌ లక్షణాలు కనిపించిన వాళ్లు మాత్రమే ఆస్పత్రులకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రజలకు ఎదురైన ఇబ్బందులన్నింటినీ తొలగించేందుకు కృషి చేస్తామని ట్రంప్‌ చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?