అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ బీర్ల కంపెనీ ఉద్యోగి తోటి ఉద్యోగులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. అనంతరం తనను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం మిల్‌వాకీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం మోల్‌సన్‌ కూర్స్‌ బ్రివరీస్‌ కంపెనీలో పనిచేసే 51ఏళ్ల ఉద్యోగి మిల్‌వాకీలోని మోల్‌సన్‌ కూర్స్‌ బ్రివరీస్‌ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న గన్‌తో అక్కడ పనిచేస్తున్న తోటి ఉద్యోగులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. కొద్దిసేపటి తర్వాత నిందితుడి తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటనను ఎంతో క్రూరమైనదిగా ఆయన అభివర్ణించారు.

DO YOU LIKE THIS ARTICLE?